
Voter ID: ఒకటి కంటే ఎక్కువ ఓటరు ఐడీ ఉంటే తప్పనిసరిగా సరెండర్ చేయాలి : ఎన్నికల సంఘం
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల ఓటరు గుర్తింపు కార్డుల (Voter ID)విషయంలో ఎన్నికల సంఘానికి పలు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఒక వ్యక్తి దగ్గర ఒకటి కంటే ఎక్కువ ఓటరు కార్డులు ఉండటం నేరమని,అలాంటి పరిస్థితుల్లో అదనపు కార్డులను తప్పనిసరిగా సరెండర్ చేయాలని స్పష్టంచేసింది. "ప్రజా ప్రాతినిధ్య చట్టం,1950 ప్రకారం ఒక వ్యక్తి దగ్గర రెండు,అంతకంటే ఎక్కువ కార్డులు ఉంటే నేరంగా పరిగణించబడుతుంది.సెక్షన్ 31 ప్రకారం,అలాంటి వారికి గరిష్టంగా ఏడాది జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. కాబట్టి ఎవరి వద్ద అయినా ఒకటి కంటే ఎక్కువ ఓటరు కార్డులు ఉంటే,ఒక్క కార్డు మాత్రమే తమ వద్ద ఉంచుకోవాలి''అని ఈసీ అధికారులు వెల్లడించారు.
వివరాలు
పవన్ ఖేడాకు రెండు ఓటరు కార్డులు.. నోటీసు జారీచేసిన ఎన్నికల సంఘం
అలాగే ఓటరు జాబితాలో రెండు ప్రాంతాల్లో పేరు ఉంటే,ఒకచోట తమ పేరును తొలగించుకోవాలని సూచించారు. ఇందుకోసం ఫారం-7 ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని,ఈ ప్రక్రియను ఆన్‌లైన్ ద్వారా కూడా పూర్తి చేసుకునే సౌకర్యం ఉందని తెలిపారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత,ఆ పార్టీ మీడియా-పబ్లిసిటీ విభాగం ఛైర్మన్ పవన్ ఖేడాకు సంబంధించి ఫిర్యాదు ఎన్నికల సంఘం దృష్టికి వెళ్లింది. ఆయన దగ్గర రెండు ఓటరు కార్డులు ఉన్నాయనే ఆరోపణలపై ఇటీవల ఈసీ నోటీసు జారీ చేసింది. దీనిపై స్పందించిన పవన్ ఖేడా, ఎన్నికల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు. తన పేరు తొలగించాలని ఇంతకుముందే దరఖాస్తు చేసినప్పటికీ, అధికారులు చర్యలు తీసుకోకపోవడంతోనే సమస్య తలెత్తిందని ఆయన స్పష్టం చేశారు.