
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్ మెరుపుదాడులు
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ, ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఉగ్రదాడికి బదులుగా భారత్ ప్రతీకార చర్యలు ప్రారంభించింది. మంగళవారం అర్ధరాత్రి 1:44 గంటలకు భారత సైన్యం 'ఆపరేషన్ సిందూర్' పేరిట పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులకు దిగింది.
ఈ ఆపరేషన్‌ను భారత ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా నిర్వహించాయి.
మిస్సైళ్లతో లక్ష్యాలను ఛేదించి ధ్వంసం చేశాయి. ఈ దాడుల్లో పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్ భూభాగంలోని ఉగ్ర మౌలిక సదుపాయాలు నాశనం అయ్యాయి.
వివరాలు
'భారత్ మాతా కీ జై' అంటూ హర్షాతిరేకంతో పోస్టులు
భారత సైన్యం మొత్తం తొమ్మిది ఉగ్ర స్థావరాలపై పక్క ప్రణాళికతో దాడులు చేసింది.
సరిహద్దులపై ఉద్రిక్తతలకు దారితీయకుండా, ఎక్కడా పాకిస్థాన్ సైనిక సదుపాయాలపై దాడి జరగలేదని భారత ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది.
దేశవ్యాప్తంగా బుధవారం కేంద్ర ప్రభుత్వం మాక్ డ్రిల్స్ నిర్వహించనున్న నేపథ్యంలో, ఈ మెరుపుదాడులు దేశవ్యాప్తంగా ఉత్కంఠకు దారితీశాయి.
ఆపరేషన్ సిందూర్‌పై కేంద్ర మంత్రులు, ప్రముఖులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో వ్యక్తం చేశారు. 'భారత్ మాతా కీ జై' అంటూ హర్షాతిరేకంతో పోస్టులు చేశారు.
వివరాలు
ఉగ్రదాడికి బాధ్యులపై చర్యలు తీసుకోవడమే లక్ష్యమన్న భారత్
పహల్గాం ఉగ్రదాడికి బాధ్యులను తప్పకుండా శిక్షించాలన్న నిశ్చయంతో భారత్ ఈ చర్యలు చేపట్టిందని వెల్లడించింది.
దాడుల పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని రక్షణశాఖ పేర్కొంది.
భారత ప్రభుత్వం ప్రకటన అనంతరం, ఇండియన్ ఆర్మీ "న్యాయం జరిగింది" అనే సందేశంతో ఎక్స్‌లో పోస్టు చేసింది.
ఈ దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అయితే దాడులు జరిగిన ఖచ్చిత ప్రాంతాలను భారత సైన్యం ఇంకా వెల్లడించలేదు.
ఈ నేపథ్యంలో, భారత్‌లోని శ్రీనగర్, జమ్ము, అమృత్‌సర్, ధర్మశాల, లేహ్ విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేసినట్లు సమాచారం.
వివరాలు
పాక్ స్పందన - సైనిక, ప్రభుత్వ స్థాయిలో ప్రకటనలు
భారత దాడులపై పాకిస్థాన్ సైన్యం స్పందించింది. డీజీ ఐఎస్‌పీఆర్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరీ ప్రకారం, పాకిస్థాన్‌లోని కొట్లీ, మురిద్కే, బహావల్పూర్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయని తెలిపారు.
ఈ దాడుల్లో ముగ్గురు మృతి చెందగా, 12 మందికి గాయాలయ్యాయని చెప్పారు.
తగిన సమయంలో బదులిచ్చే దిశగా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.
భారత్ తాత్కాలికంగా హర్షం పొందినా, దీని ఫలితంగా శాశ్వత దుఃఖాన్ని చవిచూడాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు.
వివరాలు
స్పందించిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్
ఇండియన్ ఆర్మీ దాడులపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. ''పాక్‌లోని ఐదు ప్రాంతాల్లో మోసపూరితంగా దాడులు జరిగాయి. ఈ చర్యలకు తగిన ప్రతిస్పందన తప్పదని'' అన్నారు.
ప్రస్తుతం దేశమంతా పాక్ ఆర్మీ వెనక నిలబడిందని చెప్పారు. తమకు శత్రువును ఎలా ఎదుర్కోవాలో తెలుసని, వ్యూహాత్మకంగా ప్రతిఘటన చేస్తామని పేర్కొన్నారు.
ఈ దాడులను యుద్ధ చర్యలుగా పరిగణించారు. ఆయన ప్రకటన అనంతరం, సరిహద్దు పూంఛ్, రాజౌరి సెక్టార్లలో పాక్ సైన్యం కాల్పులు ప్రారంభించింది.
భారత్ సైతం ప్రతిస్పందనగా కాల్పులకు దిగింది. దీంతో ఎల్‌వోసీ వెంబడి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
పాకిస్థాన్‌లోని మురిద్కే ప్రాంతం లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు ప్రధాన కేంద్రంగా ఉంది.
వివరాలు
భద్రతా వ్యవస్థల అప్రమత్తత - అమెరికాతో చర్చలు
అదే విధంగా బహావల్పూర్ (పంజాబ్ ప్రావిన్స్‌లో) జైష్-ఎ-మహ్మద్‌కు చెందిన మసూద్ అజార్ ప్రధాన కార్యాలయం ఉంది.
భారత్ దాడులకు ప్రతిస్పందనగా పాక్ అప్రమత్తమైంది. లాహోర్, సియాల్కోట్ ఎయిర్‌పోర్ట్‌లను 48 గంటల పాటు మూసివేసింది.
మరోవైపు, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అమెరికా భద్రతా సలహాదారు మార్కో రూబియోతో మాట్లాడి దాడుల వివరాలను తెలిపారు.
భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు సరిహద్దుల వెంట అప్రమత్తంగా మోహరించబడ్డాయి. పాక్ నుంచి ఏవైనా వ్యతిరేక చర్యలు జరిగితే వెంటనే స్పందించేందుకు ఈ ఏర్పాట్లు చేశారు.
బుధవారం ఉదయం 10:30 గంటలకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ జాతీయ భద్రతా కమిటీతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు.
వివరాలు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందన
భారత మెరుపు దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. భారత్, పాకిస్థాన్ మధ్య పరిస్థితులు అత్యంత భయానకంగా ఉన్నాయని అన్నారు.
ఇరు దేశాలు ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని సూచించారు. ''ఇది అత్యంత హేయమైన పరిస్థితి. రెండు శక్తిమంతమైన దేశాలు ఇలాగే ఘర్షణ పడటం మానేయాలి. ఇది తొందరగా ముగించాలి. ప్రపంచానికి శాంతి అవసరం. ఘర్షణలకు స్థానముండకూడదు'' అని అన్నారు.