భారీ వర్షాల వల్ల భారత్‌లో 2,038మంది మృతి; హిమాచల్‌లో తీవ్ర నష్టం
ఈ ఏడాది వర్షాకాలంలో వరదలు, పిడుగులు, కొండచరియలు విరిగిపడటంతో భారతదేశంలో మొత్తం 2,038 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్రం హోంశాఖ తెలిపింది. బిహార్‌లో అత్యధికంగా 518 మంది, హిమాచల్ ప్రదేశ్‌లో 330 మంది మరణించారు. వర్షాల సమయంలో 101మంది గల్లంతయ్యారు. 1,584 మంది గాయపడ్డారు. ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 17 వరకు సంభవించిన వరదల నష్టంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఓ నివేదికను విడుదల చేసింది. అందులో ఈ అంశాలను వెల్లడించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, దేశంలోని 335 జిల్లాలు వర్షాలు, కొండచరియలు, మెరుపులతో ప్రభావితమయ్యాయి, వీటిలో మధ్యప్రదేశ్‌లో 40, అస్సాంలో 30, ఉత్తరప్రదేశ్‌లో 27 ఉన్నాయి.
పిడుగుపాటుకు 506మంది మృతి
మరో వైపు హిమాచల్ ప్రదేశ్‌లోని 12 జిల్లాలు, ఉత్తరాఖండ్‌లోని ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు, కొండచరియలు విరిగి తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వరదల కారణంగా 892 మంది, పిడుగుపాటుకు 506మంది, కొండచరియలు విరిగిపడటంతో 186 మంది మరణించారని హోం మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. మరో 454 మంది ఈ సీజన్‌లో అనేక ఇతర కారణాల వల్ల మరణించారు. వర్షాలు, వరదలు, కొండచరియలు, పిడుగుల కారణంగా గుజరాత్‌లో 165 మంది, మధ్యప్రదేశ్‌లో 138 మంది, కర్ణాటక, మహారాష్ట్రలో 107మంది చొప్పున, ఛత్తీస్‌గఢ్‌లో 90మంది, ఉత్తరాఖండ్‌లో 75మంది మరణించారు. హిమాచల్ ప్రదేశ్‌లో 17, మహారాష్ట్రలో 14, ఉత్తరప్రదేశ్, జమ్ముకశ్మీర్‌లో ఒక్కొక్కటి 12, అస్సాం, పశ్చిమ బెంగాల్‌లో 10 చొప్పున, ఉత్తరాఖండ్‌లో 9 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను మోహరించారు.
'ప్రకృతి విపత్తు ప్రభావిత ప్రాంతం'గా హిమాచల్ ప్రదేశ్
హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం మొత్తం రాష్ట్రాన్ని 'ప్రకృతి విపత్తు ప్రభావిత ప్రాంతం'గా ప్రకటించింది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం తీవ్రనష్టాన్ని చవిచూసింది. భారీగా ప్రాణనష్టం, విధ్వంసం, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నష్టాన్ని రాష్ట్రం ఎదుర్కొంది. కొండచరియలు విరిగిపడటం, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్రం మొత్తం తీవ్రంగా ధ్వంసమైంది. వేలాది సంఖ్యలో నివాస గృహాలు దెబ్బతిన్నాయి. పంటలు దెబ్బతిన్నాయి. ఆస్తి, పశువులు, మౌలిక సదుపాయాలు, పంటల నష్టాల అంచనాలను సంబంధిత జిల్లా అధికారులు, శాఖలు నిర్వహిస్తాయని ప్రభుత్వం పేర్కొంది.