Dense Fog: ఉత్తర భారతదేశంలో పెరిగిన చలి తీవ్రత.. విమాన, రైలు సర్వీసులకు అంతరాయం
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర భారతదేశంలో చలి తీవ్రత పెరిగిపోయింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, బీహార్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి.
ఈ పరిస్థితుల కారణంగా ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు. చలి తీవ్రత అధికమైనందున, ఈ ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది.
దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం కనిష్ట ఉష్ణోగ్రత 6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.
ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో దృశ్యమానత దారుణంగా తగ్గిపోయింది.
కొన్నిచోట్ల విజిబిలిటీ జీరోకు చేరడంతో రహదారులపై వాహనాలు ముందుకు సాగడం కష్టమైంది. పొగమంచు ప్రభావంతో ఢిల్లీలో విమాన, రైలు సర్వీసులు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
వివరాలు
200కిపైగా విమానాలు ఆలస్యంగా
ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం ఉదయం 6 గంటలకు విజిబిలిటీ 100 మీటర్లకు తగ్గిపోయింది.
దీంతో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో రాకపోకలు సాగించే 200కిపైగా విమానాలు ఆలస్యంగా నడిచాయి.
కొన్ని విమానాలు రద్దు చేయగా, మరికొన్నింటిని ఇతర మార్గాలకు మళ్లించారు. ఈ ఆలస్యాల కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఈ పరిస్థితుల్లో ఇండిగో, స్పైస్‌జెట్, ఎయిర్ ఇండియా వంటి విమాన సంస్థలు తమ ప్రయాణికులకు ముందుగానే సూచనలు చేశారు. ఫ్లైట్ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని సూచించారు.
వివరాలు
ఆలస్యంగా 26 రైళ్లు
పొగమంచు ప్రభావంతో కనీసం 26 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు తెలుస్తోంది.
వాతావరణ శాఖ అంచనా ప్రకారం, బుధవారం ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఆకాశం మేఘావృతమై ఉండి సాయంత్రం తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది.
ఈ చలి తీవ్రతతో పాటు, ఢిల్లీలో వాయు నాణ్యతా స్థాయి కూడా పేలవంగా ఉంది. బుధవారం ఉదయం 8 గంటలకు ఏక్యూఐ లెవెల్స్ 332గా నమోదయ్యాయి, ఇది చాలా అధ్వాన్నమైన స్థాయిగా భావించబడుతుంది.