Chennai Rains: చెన్నైలో రెండ్రోజులుగా కుండపోత వర్షాలు.. 300 ప్రాంతాలు జలమయం
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా, చెన్నై సహా పరిసర జిల్లాల్లో రెండ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల ఆరెంజ్ అలర్ట్,మరికొన్నిచోట్ల రెడ్ అలర్ట్ జారీ చేయబడింది. కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. చెన్నైలోని పలు జిల్లాల్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రెండు రోజులు కురుస్తున్న వర్షాల కారణంగా నగరం పూర్తిగా అతలాకుతలమైంది. చెన్నైలో దాదాపు 300 ప్రాంతాలు నీట మునిగాయి. పలు సబ్‌వేలలో మూడు అడుగుల మేర నీరు నిలిచింది. చెన్నైతో పాటు తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో కూడా అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇంకా చాలా ప్రాంతాలు జలమయమవుతున్నాయి. వరదల్లో కార్లు కొట్టుకుపోకుండా దగ్గరలోని ఫ్లైఓవర్లపై పార్కింగ్ చేసుకుంటున్నారు.
ఏపీలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు
చెన్నైలో చాలా ప్రాంతాల్లో మోకాలు లోతు నీళ్లు చేరుకున్నాయి. వాతావరణం సరిగ్గా లేకపోవడంతో విమానాలు, రైళ్లు రద్దు చేశారు. రేపటి వరకూ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. చెన్నై, చెంగల్ పేట్, తిరువల్లూరు, కాంచీపురం జిల్లాల్లో అత్యవసర సేవలు మినహా అన్నీ మూసివేయబడ్డాయి. అలాగే పుదుచ్చేరిలో పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. ఏపీలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. రేపు (అక్టోబర్ 17) వరకు పుదుచ్చేరి, తమిళనాడు, ఏపీ తీరాల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీయనున్నాయి.