
India-Pakistan: హెచ్చరికలు జారీచేసినా పట్టించుకోని పాకిస్థాన్.. సరిహద్దుల్లో కొనసాగుతున్న కవ్వింపు చర్యలు
ఈ వార్తాకథనం ఏంటి
"కుక్క తోక వంకరే" అన్న నానుడి సరిగ్గా పాకిస్థాన్ (Pakistan) తీరుకి వర్తిస్తుంది.
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందన్న విషయంపై భారత్ (India Pakistan) పలు హెచ్చరికలు జారీ చేసినా, పాక్ దానికి లెక్కచేయకుండా తన రెచ్చగొట్టే చర్యలను కొనసాగిస్తోంది.
నియంత్రణ రేఖ (LoC) వెంబడి పాక్ వరుసగా ఏకపక్షంగా కాల్పులు జరిపిస్తోంది. తాజాగా ఏడో రోజూ రాత్రి అదే విధంగా పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడటం గమనార్హం.
జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా,ఉరి,అఖ్నూర్ సెక్టార్‌లలో పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులు జరిపింది.
అయితే ఈ చర్యలను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు సైనిక వర్గాలు వెల్లడించాయి.
వివరాలు
పాక్ సైన్యం కాల్పులు
ఏప్రిల్ 22న పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి తరువాతే పాకిస్తాన్ ఇటువంటి అప్రకటిత కాల్పులకు పాల్పడుతోందన్న విషయాన్ని అధికారులు స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, బుధవారం రాత్రి కూడా పాక్ సైన్యం కాల్పులకు పాల్పడినట్టు రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ కాల్పులు జమ్మూ ప్రాంతంలోని అంతర్జాతీయ సరిహద్దు, రాజౌరీ జిల్లాలోని సుందర్బానీ, నౌషేరా ప్రాంతాలు, కశ్మీర్‌లోని బారాముల్లా, కుప్వారా ప్రాంతాలపై జరిపినట్టు వెల్లడించారు.
2003లో భారత్-పాక్ దేశాలు అనుసంధానించిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని 2021 ఫిబ్రవరిలో పునరుద్ధరించినప్పటికీ, పాక్ తాజాగా వరుసగా ఆరు రోజుల పాటు ఉల్లంఘించినట్టు అధికార వర్గాలు తెలిపారు.
వివరాలు
కాల్పులకు సంబంధించి భారత్ పలు హెచ్చరికలు
భారత్‌కు మొత్తం 3,323 కిలోమీటర్ల సరిహద్దు గలదు. ఇందులో 2,400 కిలోమీటర్లు అంతర్జాతీయ సరిహద్దుగా ఉండగా, 740 కిలోమీటర్లు నియంత్రణ రేఖ (LoC)గా ఉన్నాయి.
పాక్ కాల్పులకు సంబంధించి భారత్ పలు హెచ్చరికలు జారీ చేసింది.
ఇరు దేశాల మిలటరీ ఆపరేషన్ డైరెక్టర్ల మధ్య హాట్‌లైన్ కమ్యూనికేషన్ ద్వారా చర్చలు జరిగాయని, భారత్ స్పష్టంగా పాక్‌కు తన ఆగ్రహాన్ని తెలిపిందని రక్షణ శాఖ అధికారులు తెలిపారు.
వివరాలు
పాక్ విమానాలకు భారత గగనతలంలో నిషేధం
పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా,పాకిస్థాన్‌పై భారత్ తన చర్యలను కఠినతరం చేసింది.
తాజాగా పాక్‌కు చెందిన విమానాలకు భారత గగనతలంలోకి ప్రవేశించకుండా నిషేధం విధించింది.
పాక్ ఇప్పటికే తన గగనతలాన్ని మూసివేసి భారత్‌కు చెందిన విమానాలకు అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే.
దీనికి ప్రతిస్పందనగా భారత్ కూడా పాక్‌కు చెందిన విమానాలే కాదు,ఆదేశం ఆధ్వర్యంలో నడుస్తున్నలేదా లీజుకు తీసుకున్నవాణిజ్య,మిలిటరీ విమానాల ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.
ఈ నిషేధం ఏప్రిల్ 30 నుండి మే 23 వరకు అమలులో ఉంటుందని అధికారులు వెల్లడించారు.
భారత్ విధించిన ఈ ఆంక్షల కారణంగా పాకిస్తాన్ నుండి కౌలాలంపూర్ వంటి ఆగ్నేయ ఆసియా ప్రాంతాలకు వెళ్లే విమానాలు చైనా,శ్రీలంక వంటి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది.