
Indus treaty: 'ఇలా అయితే తీవ్ర దుర్భిక్షం నెలకుంటుంది': సింధూ జలాలపై పునఃసమీక్షించండి.. భారత్‌కు పాకిస్థాన్ విజ్ఞప్తి
ఈ వార్తాకథనం ఏంటి
సింధూ జలాల ఒప్పందం రద్దుతో పాకిస్థాన్‌కు ఎదురయ్యే భయం స్పష్టమైంది.
ఇటీవలి వరకు సింధూ జలాల అంశంలో గట్టిగా స్వరం వినిపించిన పాకిస్థాన్ ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు తెలుస్తోంది.
ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తే తమకు ఎదురయ్యే నష్టాన్ని గుర్తించిన పాకిస్థాన్ ఇప్పుడు ఆత్మరక్షణలో పడిపోయింది.
భారత్ కాల్పుల విరమణకు అంగీకరించినప్పటికీ, జలాల విషయంలో మాత్రం 'తగ్గేదే లే' అన్నట్టు స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది.
దీనివల్ల పాక్ తాజా పరిస్థితుల్లో భారత్‌కు లేఖ రాస్తూ, ఈ నిర్ణయాన్ని తిరిగి పరిశీలించాలని విజ్ఞప్తి చేసింది.
వివరాలు
పాకిస్థాన్ లేఖలో కీలకమైన సూచనలు
భారత జలశక్తి మంత్రిత్వశాఖకు పాకిస్థాన్ జలవనరుల శాఖ రాసిన లేఖలో, సింధూ జలాల ప్రవాహాన్ని నిలిపివేస్తే తమ దేశంలో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించింది.
అంతేగాక, ఈ అంశంపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది.
ఈ లేఖను ప్రోటోకాల్ ప్రకారం భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖకు పంపినట్లు సమాచారం.
అయితే ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ ఇదే విషయంలో తేల్చిచెప్పారు . ''రక్తం, నీరు కలిసి ప్రవహించలేవు.'' అందువల్ల ఈ ఒప్పందం విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
భవిష్యత్‌లో పాకిస్థాన్‌తో చర్చలు జరిపితే, అవి కేవలం ఉగ్రవాదం, పాక్ ఆక్రమిత కశ్మీర్ అంశాలపై మాత్రమేనని ఆయన స్పష్టమైన సందేశం ఇచ్చారు.
వివరాలు
ఏమిటీ సింధూ జలాల ఒప్పందం..?
పహల్గాం ప్రాంతంలో పర్యటకులపై ఉగ్రదాడి జరిగిన తర్వాత, భారత్ సింధూ జలాల ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది.
ఈ ఒప్పందం 1960లో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో భారతదేశం,పాకిస్థాన్ మధ్య కుదిరింది.
అప్పటి భారత ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ, పాకిస్థాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం ప్రకారం, తూర్పు ప్రాంతంలో ఉన్న రావి, బియాస్, సట్లెజ్ వంటి ఉపనదులపై భారతదేశానికి పూర్తిగా హక్కులు ఉంటాయి.
అలాగే పశ్చిమ భాగాన ఉన్న సింధూ నది, దాని ఉపనదులైన జీలం, చీనాబ్‌లపై పాకిస్థాన్‌కు హక్కులు కల్పించారు.
కానీ ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడుల నేపథ్యంలో పాకిస్థాన్‌కు గట్టి బుద్ధి చెప్పేందుకు భారత్ ఈ చారిత్రక ఒప్పందాన్ని నిలిపివేయాలని నిర్ణయించుకుంది.