
Parliament Monsoon Sessions: నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సెషన్ ప్రారంభం.. విపక్షాల ఎజెండాకు కేంద్రం రెడీ
ఈ వార్తాకథనం ఏంటి
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు ఆగస్టు 21 వరకు నెల రోజుల పాటు కొనసాగనున్నాయి. మొదటి రోజు నుంచే చర్చలకు తావిచ్చే పలు కీలక అంశాలు సెషన్‌లో నిలిచేలా కనిపిస్తున్నాయి. విపక్షాలు ఇప్పటికే మోదీ ప్రభుత్వానికి ఎదురుగా వ్యూహాత్మకంగా సిద్ధమయ్యాయి. ఇండియా కూటమి నేతల భేటీ ఇండియా కూటమిలోని 24 పార్టీల కీలక నేతలు సమావేశమై, ప్రధాన సమస్యలపై చర్చ జరిపారు. ఈ సమావేశాల సందర్భంగా పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్‌ను నిలిపివేయడం, బీహార్‌లో ఓటర్ల జాబితా స్పెషల్ ఇన్‌టెన్సివ్ రివిజన్ (SIR), అహ్మదాబాద్ విమాన ప్రమాదం, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వంటి అంశాలపై మోదీ ప్రభుత్వాన్ని పార్లమెంట్‌లో గట్టిగా నిలదీయాలని నిర్ణయించారు.
Details
మొదటి రోజు కార్యకలాపాలు ఇవే
ఉదయం 10:15 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంప్రదాయ ప్రకటన చేస్తారు. అనంతరం లోక్‌సభలో ఆదాయపు పన్ను బిల్లుపై ప్రత్యేక కమిటీ తన నివేదికను సమర్పించనుంది. స్పీకర్ చాంబర్‌లో బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం కానుంది. దీనికితోడు, జస్టిస్ వర్మపై మహాభియోగ ప్రక్రియ ప్రారంభంపై కూడా చర్చ జరగవచ్చని సమాచారం. గత మూడు నెలల్లో మరణించిన ఏడుగురు ప్రస్తుత, మాజీ ఎంపీలకు సభలో నివాళులర్పించనున్నారు. ఇదే సమయంలో విపక్షాలు పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్, ట్రంప్ వ్యాఖ్యలు వంటి అంశాలపై మోదీ ప్రభుత్వాన్ని నిలదీయడానికి సిద్ధమవుతున్నాయి.
Details
ప్రతి అంశంపై చర్చకు సిద్ధమే: కిరణ్ రిజిజు
విపక్షాలు లేవనెత్తిన ప్రతి అంశంపై చర్చకు సిద్ధంగా ఉన్నామని, అవసరమైతే ట్రంప్ వ్యాఖ్యలపై కూడా పార్లమెంట్‌లో సమాధానం ఇస్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. కాగా, కాంగ్రెస్ నేత గౌరవ్ గోగోయ్ మాట్లాడుతూ, ట్రంప్ సీజ్‌ఫైర్ వ్యాఖ్యలపై, పహల్గాం దాడికి కారణమైన భద్రతా లోపాలపై, బీహార్ SIRలో జరుగుతున్న అవకతవకలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటన ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ వర్షాకాల సమావేశాలు చురుకైన చర్చలకు వేదికవుతాయన్న అంచనాలు కనిపిస్తున్నాయి. విపక్షాలు ప్రభుత్వాన్ని చుట్టుముట్టేందుకు సిద్ధమవుతుండగా, అధికారపక్షం వాటికి సమాధానం ఇచ్చేందుకు ఆత్మవిశ్వాసంతో ఉన్నట్టు సంకేతాలు వస్తున్నాయి.