Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి రూ.కోటి విరాళం అందజేసిన పవన్ కళ్యాణ్
తెలంగాణలో వరద బాధితులకు అండగా నిలిచేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన వంతుగా రూ.కోటి విరాళాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్ నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో వరదల వల్ల జరిగిన నష్టానికి స్పందనగా సీఎం సహాయనిధికి కోటి రూపాయల విరాళం అందజేశారు. చెక్‌ను పవన్ స్వయంగా రేవంత్ రెడ్డికి అందజేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగే ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం కోసం ఈ సహాయనిధి విరాళం అందజేయడం తన బాధ్యతగా భావిస్తున్నానని పవన్ పేర్కొన్నారు.
ఒక్క రోజు జీతాన్ని అందజేసిన పంచాయతీరాజ్ ఉద్యోగులు
పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయలు విరాళంగా ప్రకటించారు. అదనంగా, రాష్ట్రంలో వరదల వల్ల నష్టపోయిన నాలుగు వందల గ్రామాలకు ఒక్కొక్క పంచాయతీకి లక్ష రూపాయల నిధి కింద మొత్తం నాలుగు కోట్ల విరాళాన్ని ప్రకటించడం విశేషం. పవన్ నేతృత్వంలోని పంచాయతీరాజ్ ఉద్యోగులు కూడా విరాళాలు అందించారు. ఏపీ సీఎం సహాయనిధికి పంచాయతీరాజ్ ఉద్యోగులు తమ ఒక్క రోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. 1.64 లక్షల మంది ఉద్యోగుల ఒక్క రోజు మూల వేతనంగా రూ. 14 కోట్లు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం నుండి రూ. 75 లక్షలు, గ్రామీణ నీటి పారుదల శాఖ ఉద్యోగులు రూ. 10 లక్షలు విరాళం అందజేశారు.