
Pawan Kalyan: 'మార్క్ కోలుకున్నా.. మానసికంగా భయపడుతున్నాడు': పవన్
ఈ వార్తాకథనం ఏంటి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండవ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఇటీవల ఓ తీవ్రమైన ప్రమాదం నుంచి బయటపడ్డాడు.
సింగపూర్‌లోని ఒక పాఠశాలలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో మార్క్ తీవ్రంగా గాయపడ్డాడు.
మంటల వల్ల ఏర్పడిన పొగ ఊపిరితిత్తుల్లోకి చొచ్చుకుపోవడంతో వైద్యులు బ్రాంకోస్కోపీ చికిత్సను అందించారు.
సింగపూర్‌లోనే వైద్యం చేయించిన పవన్ కళ్యాణ్, ఆయన భార్య అన్నా లెజినోవా, అనంతరం కుమారుడిని హైదరాబాద్‌కు తీసుకువచ్చారు.
తన కుమారుడు దేవుడి కృపతో మెల్లగా కోలుకుంటున్నాడని, పరిస్థితి మెరుగవుతోందని పవన్ తెలిపారు. ఈ విషయాన్ని తెలుసుకున్న అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.
వివరాలు
పవన్ కుమారుడికి సైక్రియాటిస్ట్‌తో చికిత్స
తాజాగా తన కుమారుడి ఆరోగ్య పరిస్థితిపై లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు పవన్ కల్యాణ్.
పహల్గామ్ ఘటనలో మరణించినవారికి నివాళులు అర్పించేందుకు మంగళగిరిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన పవన్, మార్క్ ఆరోగ్యం గురించి మాట్లాడారు.
''ఇటీవల నా కొడుకు సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడ్డాడు. ఆ ప్రమాదంలో ఒక బాలుడు మృతిచెందాడు. మరొకరికి చేతులు, కాళ్లు గాయపడ్డాయి. నా కుమారుడికి పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్లడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పటికీ అతను పూర్తిగా కోలుకోలేదు. అర్ధరాత్రుల సమయంలో అతను పీడకలలతో ఉలిక్కిపడుతూ, మేడ మీద నుండి పడిపోతున్నట్టు కలలు కంటున్నాడు. ఈ మానసిక ఆందోళన నుంచి బయటపడేందుకు మేము సైకియాట్రిస్ట్ ద్వారా చికిత్స అందిస్తున్నారు'' అని పవన్ పేర్కొన్నారు.
వివరాలు
మూడు సినిమాల్లో పవన్
పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికలపై వైరల్ అవుతున్నాయి.
ఆయన కుమారుడు త్వరగా కోలుకోవాలని అభిమానులు, జనసేన కార్యకర్తలు పెద్దఎత్తున ప్రార్థనలు చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
అంతేకాకుండా, పవన్ భార్య అన్నా లెజినోవా తమ కుమారుడి ఆరోగ్యం మెరుగవ్వాలని కోరుతూ తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. తలనీలాలు సమర్పించడంతో పాటు, అన్నదానం కూడా నిర్వహించారు.
మరోవైపు పవన్ కళ్యాణ్,డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్‌లో తన బాధ్యతలను నిర్వర్తిస్తూ, సినిమాల పనులను కూడా సమాంతరంగా కొనసాగిస్తున్నారు.
ప్రస్తుతం ఆయన 'హరిహర వీరమల్లు','ఉస్తాద్ భగత్ సింగ్', 'OG' అనే మూడు సినిమాల్లో నటిస్తున్నారు.
వీటిలో 'హరిహర వీరమల్లు' చిత్రాన్ని మొదటగా విడుదల చేయాలని చిత్రబృందం యోచిస్తోంది.