
Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్.. పోలీసుల అదుపులో ఆగంతకుడు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను చంపేస్తామని బెదిరిస్తూ ఓ వ్యక్తి ఆయన పేషీకి ఫోన్ కాల్స్ చేయడం, సందేశాలు పంపడం కలకలం రేపింది.
ఈ విషయాన్ని పేషీ సిబ్బంది పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లి, అనంతరం పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేశారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. బెదిరింపు కాల్స్ చేసిన నూక మల్లికార్జునరావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
అతను మద్యం మత్తులో ఈ బెదిరింపు చర్యలకు పాల్పడ్డట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతనిని రహస్యప్రదేశంలో విచారిస్తున్నారు.
వివరాలు
టాస్క్‌ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్, లా అండ్ ఆర్డర్ విభాగాల సహకారంతో గాలింపు
బెదిరింపు కాల్స్ 95055 05556 అనే నంబరు నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ నంబరు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ప్రాంతానికి చెందిన మల్లికార్జునరావు పేరుతో నమోదైందని తేల్చారు.
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద టవర్ నుంచి ఈ కాల్స్ వచ్చినట్లు వివరించారు.
నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబు నాలుగు బృందాలను ఏర్పాటు చేసి టాస్క్‌ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్, లా అండ్ ఆర్డర్ విభాగాల సహకారంతో గాలింపు చేపట్టారు.
ఫోన్ స్విచాఫ్ కావడంతో నిందితుడి స్థానాన్ని గుర్తించడం కష్టమైనా, విజయవాడ, తిరువూరు ప్రాంతాల్లో దర్యాప్తు నిర్వహించిన పోలీసులు చివరకు మల్లికార్జునరావును పట్టుకున్నారు.