
GVMC: విశాఖ మేయర్‌గా పీలా శ్రీనివాసరావు ఎన్నిక
ఈ వార్తాకథనం ఏంటి
విశాఖపట్టణం మహానగర పాలక సంస్థ (జీవీఎంసీ) మేయర్‌గా పీలా శ్రీనివాసరావు ఎన్నికయ్యారు.
సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన జీవీఎంసీ పాలకవర్గ సమావేశాన్ని జిల్లా సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్ నేతృత్వంలో నిర్వహించారు.
ఈ సమావేశానికి కార్పొరేటర్లు, ఎక్స్‌అఫిషియో సభ్యులు హాజరయ్యారు. అనంతరం మేయర్‌గా పీలా శ్రీనివాసరావు ఎన్నికైనట్లు జాయింట్ కలెక్టర్ ప్రకటించి ధ్రువపత్రం అందజేశారు.
2021లో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో తెదేపా తరఫున పీలా శ్రీనివాసరావు అభ్యర్థిగా నిలిచినప్పటికీ మెజారిటీ లేకపోవడం వల్ల మేయర్ పదవి దక్కలేదు.
అయినా నాలుగేళ్ల పాటు పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, వైసీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేసిన పీలా శ్రీనివాసరావుకు మరోసారి అవకాశం లభించింది.
Details
గుంటూరు మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర
ఇక గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర విజయం సాధించారు.
రవీంద్రకు 34 ఓట్లు, వైసీపీ మద్దతుతో బరిలో ఉన్న వెంకటరెడ్డికి 27 ఓట్లు లభించాయి. ఈ ఫలితాన్ని ప్రిసైడింగ్ అధికారి భార్గవ్ తేజ అధికారికంగా ప్రకటించారు.
చిత్తూరు జిల్లా కుప్పం పురపాలిక ఛైర్మన్ ఎన్నికలో తెదేపా అభ్యర్థి సెల్వరాజ్ విజయం సాధించారు.
ఐదో వార్డు కౌన్సిలర్‌గా ఉన్న సెల్వరాజ్‌కు 15 ఓట్లు, వైసీపీ తరఫున బరిలో ఉన్న 9వ వార్డు సభ్యుడు ఎస్ డీ హఫీజ్‌కు 9 ఓట్లు లభించాయి. ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి శ్రీనివాసరాజు సెల్వరాజ్ విజయం ప్రకటించారు.
ఈ విజయం నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు కుప్పంలో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.