People Empowerment Platform : పీపుల్ ఎంపవర్‌మెంట్ ప్లాట్‌ఫారమ్.. గూగుల్‌తో హిమాచల్ ప్రభుత్వం కొత్త ప్రాజెక్ట్
హిమాచల్ ప్రదేశ్‌లో వ్యవసాయం, విపత్తుల నిర్వహణ, ఉపాధి, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో అధునాతన సాంకేతికత విప్లవాత్మక మార్పులు తెచ్చే సామర్థ్యం కలిగి ఉందని ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖు అన్నారు. కచ్చితమైన వాతావరణ అంచనాలతో ప్రణాళికలను మెరుగుపరచడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ఆయన వెల్లడించారు. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం, గూగుల్ సహకారంతో, 'పీపుల్ ఎంపవర్‌మెంట్ ప్లాట్‌ఫారమ్'ను అభివృద్ధి చేయాలని యోచిస్తోంది. ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా పౌరులు తమ అవసరాలకు అనుగుణంగా ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్లు వంటి నైపుణ్యం కలిగిన సర్వీస్ ప్రొవైడర్లతో అనుసంధానమవుతారు.
యువతకు ఉపాధి పెరిగే అవకాశాలు
ఈ చర్య ద్వారా రాష్ట్రంలోని అసంఘటిత రంగం యువతకు ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. గూగుల్ ఇండియా హెడ్ ఆశిష్ వాటల్ రాష్ట్రానికి డిజిటల్ సాంకేతికత ఆధారంగా పౌర సేవలను మెరుగుపరచడానికి ప్రత్యేక సహకారం అందించాలని సూచించారు. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వంటి రంగాల్లో ఏఐ ఆధారిత పరిష్కారాలను ఉపయోగించి వేగవంతమైన సేవల్ని అందించడానికి చర్చలు జరిగాయి. పౌర ఫిర్యాదుల పరిష్కారంలో వేగం, సామర్థ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం సేవా సంకల్ప్ హెల్ప్‌లైన్ 1100ను ఏఐ ఆధారంగా అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించింది. వినియోగదారుల సంతృప్తి కోసం త్వరితగతిన ఫిర్యాదులను పరిష్కరించడమే దీని లక్ష్యమని ముఖ్యమంత్రి అన్నారు.
సాంకేతికత ద్వారా ప్రజల జీవితాలు మెరుగుపడతాయి
హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం విద్యా రంగంలో వినూత్న మార్పుల కోసం కృషి చేస్తోంది. రాష్ట్రంలోని రెండు ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాలల్లో ఏఐ ఆధారిత బోధనా మాడ్యూళ్లను ప్రయోగాత్మకంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది విద్యార్థుల అభ్యాస ఫలితాలను మెరుగుపరచడంలో కీలకంగా ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజల సంక్షేమం కోసం వినియోగించడంలో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ముందంజలో ఉంది. వ్యవసాయం, విపత్తుల నిర్వహణ వంటి రంగాల్లో సాంకేతికత ద్వారా ప్రజల జీవితాలు మెరుగుపడతాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ప్రయత్నాల ద్వారా రాష్ట్రంలోని పౌరులకు వేగవంతమైన, ప్రభావవంతమైన సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం సుఖు స్పష్టం చేశారు.