
Pilots: డీజీసీఏ కొత్త నిబంధనలు.. విమానయాన రంగంలో కలకలం
ఈ వార్తాకథనం ఏంటి
వాణిజ్య విమానాలను నడిపే పైలట్లకు సంబంధించి వైద్యపరీక్షలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA)ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాలు విమానయాన రంగ సంస్థల్లో గందరగోళాన్ని కలిగిస్తున్నాయి. ఈ పరీక్షలు తప్పనిసరిగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF)బోర్డింగ్ సెంటర్లలోనే జరగాలని డీజీసీఏ ఆదేశించడంపై విమానయాన సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు ఆంగ్ల మీడియా కథనాల్లో వెల్లడైంది. ఇటీవల అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న విమాన ప్రమాదం,విధుల్లో ఉన్నప్పుడు పైలట్లకు గుండె సంబంధిత సమస్యలు రావడం వంటి ఘటనలను దృష్టిలో ఉంచుకుని డీజీసీఏ ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటివరకు ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు చేయించుకుని ఫలితాలు సమర్పించుకునే అవకాశం ఉన్నా,ఇప్పుడు వాటిని ఇక నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బోర్డింగ్ సెంటర్లలోనే చేయించుకోవాలని స్పష్టం చేసింది.
వివరాలు
బీమా వ్యయాలు కూడా పెరిగే అవకాశం
అయితే మిలిటరీ పైలట్లకు అనుసరించే పరీక్షలు చాలా కఠినంగా ఉండటంతో, వాటిని సివిల్ పైలట్లకు వర్తింపజేయడం న్యాయమయ్యదని విమానయాన సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. ఈ కొత్త నిబంధనలు పైలట్ల కొరతకు దారితీసే ప్రమాదం ఉందని, దాంతో విమానాల సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశముందని సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరీక్షల వల్ల అనేకమంది పైలట్లు వైద్యపరంగా అర్హత కోల్పోయే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. దీనివల్ల సంస్థల బీమా వ్యయాలు కూడా పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. పైలట్ల వర్గాలు కూడా ఈ మార్పులను వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా పైలట్ల కొరత ఉన్న ఈ సమయంలో మరికొంతమంది విధులకు దూరమయ్యే అవకాశాన్ని వారు ప్రస్తావిస్తున్నారు.
వివరాలు
దిల్లీ,జోర్హాట్, బెంగళూరు కేంద్రాల్లో మాత్రమే IAF బోర్డింగ్ సెంటర్లు
ప్రస్తుతం దేశంలో కేవలం దిల్లీ,జోర్హాట్, బెంగళూరు కేంద్రాల్లో మాత్రమే IAF బోర్డింగ్ సెంటర్లు ఉన్నాయి. విధుల్లో లేని సమయంలో పైలట్లు అక్కడికి వెళ్లి పరీక్షల కోసం అపాయింట్‌మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఇది వారిపై ప్రయాణ భారం,సమయ భారం పెంచుతుందని ఎయిర్‌లైన్స్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ALPA India) ఆందోళన వ్యక్తం చేసింది. జూన్ 12న గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమానాశ్రయంలో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదానికి కారణమైంది.
వివరాలు
విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు
ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడడం గమనార్హం. ఇటీవల బెంగళూరులో ఓ పైలట్ అకస్మాత్తుగా కుప్పకూలడంతో, దిల్లీకి బయలుదేరాల్సిన విమానం టేకాఫ్ ఆలస్యమైంది. ఆ సమయంలో మరో పైలట్ వచ్చి విమానాన్ని గమ్యస్థానానికి తీసుకెళ్లాడు. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో డీజీసీఏ ఈ కొత్త నిర్ణయాలు తీసుకున్నట్లు భావించవచ్చు.