
Bengal Violence: నేడు బెంగాల్ అల్లర్లపై సుప్రీంకోర్టులో విచారణ..
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన హింసాత్మక ఘటన నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది.
ఈ ఘర్షణల్లో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరికొంతమంది తీవ్రంగా గాయపడినట్లు పేర్కొనబడింది.
ఈ ఘటనలను ప్రాధాన్యతగా తీసుకుని, మత, రాజకీయ హింసకు సంబంధించి లోతైన విచారణ జరిపేందుకు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని న్యాయవాది శశాంక్ శేఖర్ ఝా కోరారు.
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి బాగా దిగజారినందున, ప్రభుత్వానికి వివరణ ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానాన్ని ఆయన అభ్యర్థించారు.
వివరాలు
హింసలో బాధితులైన కుటుంబాలకు నష్టపరిహారం
ఈ రిట్ పిటిషన్‌లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తో పాటు కేంద్ర ప్రభుత్వాన్నీ ప్రతివాదులుగా చేర్చారు.
హింసలో బాధితులైన కుటుంబాలకు నష్టపరిహారం అందించాలని కూడా లాయర్ శశాంక్ ఝా విజ్ఞప్తి చేశారు.
ఇటీవల రాష్ట్రంలో చట్టాన్ని అత్రిక్రమించిన విధంగా చోటుచేసుకున్న అల్లర్ల పట్ల సుప్రీంకోర్టు తక్షణంగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఈ హింసాత్మక ఘటనల్లో ప్రజలపై బహుళ దాడులు జరిగి, ప్రాణనష్టంతో పాటు, ఆస్తి నష్టం, హిందువుల మతపరమైన నిర్మాణాల ధ్వంసం కూడా చోటు చేసుకున్నట్లు వివరించారు.
వివరాలు
ముర్షిదాబాద్‌తో పాటు హింస ప్రభావిత ప్రాంతాల్లో ఉద్రిక్తతలు
ఈ నేపథ్యంలో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు), ఆర్టికల్ 19 (వాక్స్వాతంత్ర్యం), ఆర్టికల్ 21 (జీవించే హక్కు), ఆర్టికల్ 25 (మత స్వేచ్ఛ) హక్కులను ఈ సంఘటనలు ఉల్లంఘిస్తున్నాయని పిటిషన్‌లో స్పష్టం చేశారు.
ముర్షిదాబాద్‌తో పాటు హింస ప్రభావిత ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రజల ప్రాణాలు రక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని న్యాయవాది శశాంక్ ఝా కోర్టును అభ్యర్థించారు.