
Pm Modi: ప్రధాని మోదీతో హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ భేటీ
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్‌తో ఉన్న నియంత్రణ రేఖ వెంబడి పాక్ రేంజర్లు నిర్దాక్షిణ్యంగా పౌరులను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.భారత ప్రధాని నరేంద్ర మోదీతో కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ సమావేశమయ్యారు.
ఈభేటీలో సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల భద్రతపై విస్తృతంగా చర్చలు జరిపారు.
ఇటీవల భారత సైన్యం'ఆపరేషన్ సిందూర్'పేరుతో పాక్ ఆధారిత ఉగ్రవాద స్థావరాలపై ఆకస్మికంగా మెరుపు దాడులు చేసిన విషయం విదితమే.
దీంతో భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగిపోయాయి.
సరిహద్దుల్లోని నివాస ప్రాంతాలను టార్గెట్ చేస్తూ పాక్ రేంజర్లు జరుపుతున్న కాల్పుల నేపథ్యంలో, అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే అంశంపై మోదీ,గోవింద్ మోహన్ సమాలోచనలు జరిపారు.
వివరాలు
కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచిన పాక్
గత 14 రోజులుగా పాకిస్థాన్ బలగాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని నిర్లక్ష్యం చేస్తూ తిరిగి తిరిగి ఉల్లంఘిస్తూనే ఉన్నాయి.
ఈ కాల్పుల కారణంగా ఇప్పటివరకు 13 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా, 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడిన వారిలో 44 మంది పూంచ్ సెక్టార్‌కు చెందినవారని అధికారులు వెల్లడించారు.
మృతుల్లో ఒక జవాను కూడా ఉన్నారు. పాక్ షెల్లింగ్‌లో 5వ ఫీల్డ్ రెజిమెంట్‌కు చెందిన లాన్స్ నాయక్ దినేశ్‌కుమార్ తీవ్రంగా గాయపడి వీరమరణం పొందారని వైట్ నైట్ కోర్ అధికారికంగా ధృవీకరించింది.
వివరాలు
ఆపరేషన్ సిందూర్
ఇక మంగళవారం అర్ధరాత్రి సమయంలో, పాక్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై 'ఆపరేషన్ సిందూర్' కింద భారత్ ప్రతీకార దాడులకు దిగింది.
ఈ చర్యలో 9 ఉగ్రవాద స్థావరాలను పూర్తిగా నాశనం చేసింది.
ఈ మెరుపు దాడుల్లో 80 మంది ఉగ్రవాదులను హతమార్చిన భారత సైన్యం, ఇటీవల పహల్గాం దాడికి గట్టి ప్రతీకారం తీర్చుకుంది.