PM Modi: రాబోయే 100రోజులు చాలా కీలకం, అందరి విశ్వాసాన్ని చూరగొనాలి: ప్రధాని మోదీ
PM Modi address at BJP convention: దిల్లీలోని భారత్ మండపంలో రెండు రోజుల పాటు జరిగిన బీజేపీ జాతీయ మహాసభల ముగింపు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాబోయే 100 రోజులు ఎంతో కీలకమని, అందుకే ప్రతి ఒక్కరూ ఓటర్ల విశ్వాసం, మద్దతు పొందేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో సమాజంలోని ప్రతి వర్గానికి బీజేపీని చేరువచేయాలన్నారు. అందరి నమ్మకాన్ని చూరగొనాలని మోదీ దిశానిర్దేశం చేశారు. రాబోయే ఐదేళ్లలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలన్నా.. అన్ని లక్ష్యాలను సాధించాన్నా.. బీజేపీ అధికారంలోకి రావడం ఒక్కటే మార్గమని మోదీ అన్నారు.
25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చాం: మోదీ
గత పదేళ్ల ఎన్డీఏ పాలనలో ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని, దేశం మొత్తం విశ్వసిస్తోందని ప్రధాని అన్నారు. తమ ప్రభుత్వం 25కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చిందన్నారు. స్కామ్‌లు, ఉగ్రవాద దాడుల నుంచి దేశాన్ని విముక్తి చేశామన్నారు. పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ప్రయత్నించామని యావత్ దేశం విశ్వసిస్తోందన్నారు. ఛత్రపతి శివాజీను స్ఫూర్తిగా పేర్కొంటూ.. తాను తన ఆనందం, కీర్తి కోసం జీవించే వ్యక్తిని కాదన్నారు. దేశం కోసం ఒక సంకల్పంతో ఇంటి నుంచి బయటకు వచ్చేశానని పేర్కొన్నారు. తన ఇంటి కోసం ఆందోళన చెంది ఉంటే ఈరోజు కోట్లాది మంది పేదలకు ఇళ్లు నిర్మించి ఉండేవాడిని కాదన్నారు. తాను దేశంలోని కోట్లాది మంది పిల్లల భవిష్యత్తు కోసం బతుకుతున్నానన్నారు.
కుటుంబ రాజకీయాలపై మోదీ ధ్వజం
దేశంలోని యువత, మహిళలు, పేదల కలల సంకల్పాన్ని 'మోదీ సంకల్పం'గా ప్రధాని అభివర్ణించారు. వారి సంకల్పాన్ని నెరవేర్చేందుకు తాను అహోరాత్రులు శ్రమిస్తున్నానని మోదీ చెప్పారు. కుటుంబ రాజకీయాలపై కూడా ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. తాము రాజకీయ వ్యవస్థను కొత్తపుంతలు తొక్కించామన్నారు. స్వాతంత్య్రానంతరం మన దేశాన్ని ఏళ్ల తరబడి పాలించిన వారు కొన్ని పెద్ద కుటుంబాలకు చెందిన వారు మాత్రమే అధికారంలో ఉండేలా వ్యవస్థను రూపొందించారన్నారు. పెద్ద కుటుంబాల సన్నిహిత కుటుంబ సభ్యులు మాత్రమే ముఖ్యమైన స్థానాల్లో ఉంచారన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త వారికి కూడా అవకాశం కల్పించామన్నారు. తమ కేబినెట్‌లో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన మంత్రులు పెద్ద సంఖ్యలో ఉన్నారన్నారు.
దేశం ఇక చిన్న కలలు కనదు: మోదీ
ప్రతి భారతీయుడి జీవితాన్ని మార్చేందుకు, మరెన్నో సాధించేందుకు ఇంకా ఎన్నో నిర్ణయాలు తీసుకోవలసి ఉందని మోదీ అన్నారు. గత 10 ఏళ్లలో భారత్ ఎన్నో లక్ష్యాలను సాధించిందన్నారు. ఇప్పుడు దేశం చిన్న కలలను కనదన్నారు. దేశం చిన్న తీర్మానాలు తీసుకోదన్నారు. ఇకపై కలలు భారీగా ఉంటాయని, తీర్మానాలు కూడా భారీగా ఉంటాయన్నారు. రాబోయే ఐదేళ్లు దేశ అభివృద్ధిలో చాలా పెద్ద పాత్ర పోషించబోతున్నాయని మోదీ అన్నారు. వచ్చే ఐదేళ్లలో భారతదేశం గతంలో కంటే చాలా రెట్లు వేగంగా పని చేయాల్సి ఉంటుందన్నారు. రాబోయే ఐదేళ్లలో భారత్ అభివృద్ధి చెందిన దేశం వైపు భారీ ముందడుగు వేయాల్సి ఉందన్నారు. ఈ లక్ష్యాలన్నింటిని సాధించడానికి మొదటి షరతు ఏమిటంటే.. బీజేపీ గెలుపు ఒక్కటే అన్నారు.
రామమందిరం నిర్మాణంతో ఐదేళ్ల నిరీక్షకు తెరదించాం: మోదీ
బీజేపీ పదేళ్ల పాలనలో సాధించిన విజయాలను ప్రధాని మోదీ ప్రస్తావించారు. అయోధ్య రామమందిరం, ఆర్టికల్ 370 రద్దు, కొత్త జాతీయ విద్యా విధానం, లోక్‌సభ, అసెంబ్లీలలో మహిళలకు రిజర్వేషన్లు, ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా చట్టం మరియు కొత్త పార్లమెంటు భవనం గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు. శతాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న పనులకు తామే పరిష్కారం చూపించామన్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మించడం ద్వారా 5 శతాబ్దాల నిరీక్షణకు తెరదించామన్నారు. 7 దశాబ్దాల తర్వాత కర్తార్‌పూర్ సాహిబ్ హైవేని ప్రారంభించామని, దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఆర్టికల్ 370 నుంచి దేశానికి విముక్తి కలిగించామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రధాని మోదీ ప్రస్తావించారు. పథకాలను ఎలా పూర్తి చేయాలో ప్రతిపక్ష పార్టీలకు తెలియకపోవచ్చని ప్రధాని మోదీ అన్నారు.
మాట్లాడుతున్న మోదీ
ఎన్డీఏతోనే అభిమృద్ధి సాధ్యం: మోదీ
తమకు మూడోసారి అవకాశం ఇవ్వాలని ప్రధాని మోదీ అభ్యర్థించారు. మూడో టర్మ్‌లో భారత్‌ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దుతామని, ఇదే మోదీ హామీ అన్నారు. ప్రధాని మోదీపై వ్యక్తిగతంగా దాడి చేయాలా వద్దా అనే దానిపై ప్రస్తుతం కాంగ్రెస్‌లో పోరాటం జరుగుతోందని ప్రధాని మోదీ అన్నారు. ప్రధాని మోదీపై వ్యక్తిగతంగా దాడి చేయడం వల్ల పార్టీకి నష్టం వాటిల్లుతుందని పార్టీలోని ఓ వర్గం అంటోందని ఎద్దేవా చేశారు. అదే సమయంలో ఒక వర్గం తనపై వ్యక్తిగతంగా దాడి చేస్తుందన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని ఎన్డీయే కలలు కన్నదని అన్నారు. ఈ హామీని ఏ ప్రతిపక్ష పార్టీ చేయదని అన్నారు. ఒక ఎన్డీఏ మాత్రమే చేస్తుందన్నారు.