దిల్లీ పీఠాన్ని కదిలించిన ఒడిశా దుర్ఘటన... బాలాసోర్‌లో మోదీ పర్యటన
దేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన రైలు దుర్ఘటనల్లో ఒకటిగా నిలిచిన ఒడిశా ఘోర రైలు ప్రమాదం దిల్లీ పీఠాన్ని సైతం కదిలిస్తోంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఒడిశాలోని బాలాసోర్‌లో పర్యటించబోతున్నారు. తొలుత ప్రమాద స్థలాన్ని సందర్శించి, అనంతరం కటక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శిస్తారని సమాచారం. బహనాగా బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం సాయంత్రం 6.55 నుంచి 7 గంటల వ్యవధిలో 3 రైళ్లు తీవ్ర ప్రమాదానికి గురయ్యాయి. ఈ నేపథ్యంలో పరిస్థితిని స్వయంగా దేశ ప్రధానమంత్రి సమీక్షించబోతున్నారు. ఈ క్రమంలో దుర్ఘటనపై దిల్లీలో ఉన్నత స్థాయి సమావేశాన్ని సైతం చేపట్టారు. తాజా పరిస్థితిని స్వయంగా సమీక్షించి ప్రమాద స్థలానికి చేరుకోబోతున్నారని రైల్వే వర్గాలు తెలిపాయి.
అసలేం జరిగింది
బెంగళూరు - హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ తొలుత పట్టాలు తప్పగా, ఈ రైలు బోగీలు పక్క ట్రాక్ పై పడ్డాయని, ఫలితంగా షాలిమార్ - చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. దీంతో బెంగళూరు - హౌరా రైలుపై పడిందని తెలుస్తోంది. వెనువెంటనే పక్కనే ఆగి ఉన్న ఓ గూడ్స్ రైలుపై పడిందని అధికారులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. ఈ దారుణం కేవలం 5 నిమిషాల్లోనే చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు. కోల్‌కతాకు దక్షిణ దిక్కులో దాదాపుగా 250 కిలోమీటర్ల దూరంలో, భువనేశ్వర్‌కు ఉత్తర దిక్కులో 170 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడానికి స్పష్టమైన ఆధారాలు తెలియరాలేదు.