
PM Modi: నేడు బ్రిటన్,మాల్దీవులకు ప్రధాని నరేంద్ర మోదీ.. అజెండా ఏంటంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) పర్యటనకు బయలుదేరనున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)కు తుది రూపు ఇవ్వడం సహా, ఖలిస్తానీ తీవ్రవాదం వంటి కీలక అంశాలపై చర్చలు జరపనున్నారని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి తెలిపారు. జూలై 23 నుండి 24 వరకు మోదీ బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్‌తో సమావేశమవుతారని చెప్పారు. అలాగే, ఈ పర్యటన సందర్భంగా బ్రిటన్ రాజు చార్లెస్-3ను కూడా ప్రధాని మోదీ కలుసుకోనున్నారని వివరించారు. ఇరు దేశాల వ్యాపార రంగానికి చెందిన ప్రముఖుల మధ్య సమావేశాలు జరిపే ప్రణాళిక కూడా ఉందని చెప్పారు.
వివరాలు
భారతదేశం,బ్రిటన్ మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం పురోగతిపై సుదీర్ఘ చర్చలు
భారతదేశం,బ్రిటన్ మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం పురోగతిపై సుదీర్ఘ చర్చలు జరగనున్నట్లు మిస్రి తెలిపారు. వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలు, భద్రత, వాతావరణ మార్పులు, ఆరోగ్య రంగం, విద్య, ప్రజల మధ్య పరస్పర సంబంధాల వంటి అంశాలపై ప్రత్యేకంగా చర్చలు జరగనున్నాయని వివరించారు. ఇది ప్రధాని నరేంద్ర మోదీకి బ్రిటన్‌కు జరగనున్న నాలుగో పర్యటన కావడం విశేషం. జూలై 24న భారత్, బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు జరగనున్నాయని వెల్లడించారు.
వివరాలు
భారత్ సుమారు 20 బిలియన్ల మేర బ్రిటన్‌లో పెట్టుబడులు
ఈ పర్యటనలో మోదీకి తోడుగా కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్ కూడా లండన్‌కు వెళ్లనున్నారని తెలిపారు. ఈ వాణిజ్య ఒప్పందం ప్రకారం,భారత్ తరఫున తోలు,బూట్లు,దుస్తులు వంటి ఉత్పత్తుల ఎగుమతులపై ఉన్న పన్నులను తొలగించాలని ప్రతిపాదించబడింది. అదే సమయంలో,బ్రిటన్ తరఫున విస్కీ,కార్ల దిగుమతులపై తగిన ప్రతిపాదనలు వచ్చాయని సమాచారం. యూకే ప్రస్తుతం సుమారు 36 బిలియన్ల అమెరికన్ డాలర్ల నేరుగా విదేశీ పెట్టుబడులతో భారత్‌లో ఆరో అతిపెద్ద పెట్టుబడిదారుగా ఉంది. అదే సమయంలో, భారత్ సుమారు 20 బిలియన్ల మేర బ్రిటన్‌లో పెట్టుబడులు పెట్టినట్టు వెల్లడించారు. ఇండో-యూకే ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధాని మోదీ సమగ్రంగా చర్చించనున్నారని మిస్రి వివరించారు. ఉగ్రవాదుల అప్పగింత అంశంపై కూడా చర్చలు జరగనున్నట్టు తెలిపారు.
వివరాలు
మోయిజు అధికారం చేపట్టిన తర్వాత.. మాల్దీవుల వెళ్లే మొదటి విదేశీ నాయకుడిగా మోదీ
యూకే పర్యటన అనంతరం జూలై 25 మరియు 26 తేదీల్లో ప్రధాని మోదీ మాల్దీవులకు వెళ్లనున్నారు. మాల్దీవుల అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ మొయిజు ఆహ్వానంతో మోదీ అక్కడ పర్యటించనున్నారు. ఇది ఆయన మాల్దీవులకు జరగనున్న మూడో పర్యటన. మోయిజు అధికారం చేపట్టిన తర్వాత అక్కడకు వెళ్లే మొదటి విదేశీ నాయకుడిగా మోదీ ఈ పర్యటన చేయడం విశేషం.