Gujarat: అహ్మదాబాద్ మెట్రో ఫేజ్ IIను ప్రారంభించిన మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్-గాంధీనగర్ మెట్రో రెండో దశ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ ఫేజ్ 2లో మొత్తం 21 కిలోమీటర్ల మేరకు విస్తరించింది, ఇందులో ఎనిమిది కొత్త మెట్రో స్టేషన్లు ఏర్పాటయ్యాయి. గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో కలిసి మోడీ ఈ మెట్రో ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రారంభం అనంతరం, ప్రధాని మెట్రోలో సెక్షన్ 1 మెట్రో స్టేషన్ నుంచి గిఫ్ట్ సిటీ మెట్రో స్టేషన్ వరకు ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా, రైల్లో ఉన్న విద్యార్థులతో సరదాగా మాట్లాడారు. ఎన్డీఏ 3.0 ప్రభుత్వం జూన్ 9న బాధ్యతలు చేపట్టిన తర్వాత, ప్రధాని మోడీ గుజరాత్‌లో తొలిసారి పర్యటించడం విశేషం.
మొత్తం వ్యయం రూ. 5,384 కోట్లు
ఫేజ్ 2 మెట్రో ప్రాజెక్ట్ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించనుంది, ముఖ్యంగా పట్టణ, విద్యా కేంద్రాల మధ్య ప్రయాణించే వారికి. ఈ మెట్రో సేవలు సెప్టెంబర్ 17న ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ను గుజరాత్ మెట్రో రైల్ కార్పొరేషన్ (GMRC), కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అభివృద్ధి చేసింది. ప్రాజెక్ట్ ముఖ్యమైన ప్రాంతాలైన గుజరాత్ నేషనల్ లా యూనివర్శిటీ (GNLU), పండిట్ దీనదయాళ్ ఎనర్జీ యూనివర్శిటీ (PDEU), GIFT సిటీ, రేసన్, రాండేసన్, ధోలకువా, ఇన్ఫోసిటీ మరియు సెక్టార్-1 లను అనుసంధానిస్తుంది. మొత్తం వ్యయం రూ. 5,384 కోట్లుగా ఉంది. ఫ్రాన్స్‌లోని AFD, జర్మనీలోని KfW వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రుణాల ద్వారా నిధులు సమకూరాయి.
APMC నుంచి GIFT సిటీకి ఒక గంట ప్రయాణం
ఈ మెట్రో రైలు అహ్మదాబాద్-గాంధీనగర్ మధ్య 25 కిలోమీటర్ల ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. కేవలం రూ. 35 చెల్లించి APMC నుంచి GIFT సిటీకి ఒక గంటలోపు చేరుకోవచ్చు. సెక్టార్-1 మెట్రో స్టేషన్ నుంచి మోటెరా స్టేడియం మెట్రో స్టేషన్ వరకు రైళ్లు ఉదయం 7:20నుంచి సాయంత్రం 6:40 వరకు అందుబాటులో ఉంటాయి. GNLU మెట్రో స్టేషన్ నుంచి GIFT సిటీ మెట్రో స్టేషన్ వరకు రైళ్లు ఉదయం 8:20నుంచి సాయంత్రం 6:25 వరకు, అలాగే GIFT సిటీ నుంచి GNLU మెట్రో స్టేషన్ వరకు ఉదయం 7:18నుంచి సాయంత్రం 6:38 వరకు సేవలు అందుబాటులో ఉంటాయి. అహ్మదాబాద్ మెట్రో ఫేజ్ 2లో ఫ్రీక్వెన్సీ,సమయాలను తర్వాత దశలో పెంచే అవకాశం ఉంది.