తెలుగు రాష్ట్రాలకు వందేభారత్ డబుల్ దమాకా..ఈనెల 24న కాచిగూడ, విజయవాడ రైళ్లకు మోదీ పచ్చజెండా
తెలుగు రాష్ట్రాల మీదుగా మరో రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ - బెంగళూరు మధ్య సర్వీసును సెప్టెంబర్ 24న ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా పచ్చ జెండా ఊపనున్నారు. కాచిగూడ నుంచి యశ్వంత్‌పూర్ (బెంగళూరు) మధ్య నడవనున్న ఈ రైలు, ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీ నుంచి ప్రారంభించనున్నారు. రైలు ప్రారంభోత్సవం జరిగే కాచిగూడలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రైల్వే ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. రైలు సమయ వేళలు : సోమవారం నుంచి కాచిగూడలో ఉదయం 5.30 గంటలకు బయలుదేరి మహబూబ్‌నగర్, కర్నూలు, అనంతపురం, ధర్మవరం, హిందూపురం స్టేషన్ల మీదుగా మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది.
9 రైళ్లను ప్రారంభించనున్న మోదీ
యశ్వంత్‌పూర్‌లో తిరిగి మధ్యాహ్నం 2.45 గంటలకు బయలుదేరి రాత్రి 11.15 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. విజయవాడ-చెన్నై మధ్య వందేభారత్ రైలునూ ఇదే సమయంలో ప్రారంభోత్సవం చేయడం విశేషం. ఈ రైలు విజయవాడ నుంచి తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా చెన్నై సెంట్రల్ వరకు ప్రయాణిస్తుంది. గురువారం మినహా వారంలో మిగిలిన అన్ని రోజులు ఈ రైలు సర్వీస్ ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. ప్రతి రోజూ ఉదయం 5.30 గంటలకు విజయవాడలో బయలుదేరి మధ్యాహ్నం 12.10 గంటలకి చెన్నై చేరుతుంది. చెన్నైలో తిరిగి మధ్యాహ్నం 3.20 గంటలకు బయలుదేరి రాత్రి 10 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. వీటితో పాటు మొత్తం 9 వందే భారత్ రైళ్లను ఈనెల 24న మోదీ ప్రారంభించనున్నారు.