PM Modi: టెక్ కంపెనీల సీఈఓలతో ప్రధాని మోదీ సమావేశం
ప్రధాని నరేంద్ర మోదీ తన మూడు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్‌లోని లోట్టే ప్యాలెస్ హోటల్‌లో అమెరికా టెక్నాలజీ రంగంలోని ప్రముఖ సీఈఓలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ప్రధానంగా భారత వృద్ధి అవకాశాలు, కృత్రిమ మేధస్సు (AI), క్వాంటం కంప్యూటింగ్, సెమీకండక్టర్లు వంటి కీలక సాంకేతిక రంగాలపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో 15 మంది ప్రముఖ అమెరికన్ టెక్ కంపెనీల సీఈఓలు హాజరయ్యారు. సమావేశం విజయవంతంగా పూర్తైందని, భారతదేశం టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో సాధించిన పురోగతిని హైలైట్ చేశామన్నారు.
భారత్ మూడో ఆర్థిక వ్యవస్థ ఎదిగేందుకు కృషి
భవిష్యత్తులో భారత్‌కు మరింత ప్రోత్సాహం ఉందని ప్రధాని మోదీ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు. ఈ సమావేశంలో ప్రధానంగా భారతదేశం-అమెరికా మధ్య సాంకేతిక సహకారాన్ని విస్తృతం చేయడంపై చర్చ జరిగింది. ICET (ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్) వంటి కార్యక్రమాలు, భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యానికి కీలక అంశాలని మోదీ తెలిపారు. భారతదేశం వృద్ధి పథంలో ముందుకుసాగుతూ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని మోదీ ఆకాంక్షించారు.
పెట్టుబడులు పెట్టడానికి ప్రోత్సహాకాలు
ఈ నేపథ్యంలో సాంకేతిక ఆవిష్కరణలు, పెట్టుబడులు, సహకారం కోసం భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని అమెరికా కంపెనీలను ఆయన ప్రోత్సహించారు. మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, అడోబీ సీఈఓ శంతను నారాయణ్, Accenture సీఈఓ జూలీ స్వీట్, NVIDIA సీఈఓ జెన్సన్ హువాంగ్ వంటి అగ్రశ్రేణి సీఈఓలు పాల్గొన్నారు. అలాగే, AMD సీఈఓ లిసా సు, వెరిజోన్ సీఈఓ ఎన్రిక్ లోర్స్, ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ ఈ సమావేశానికి హాజరయ్యారు.