PM Modi: పన్నూ హత్యకు కుట్ర ఆరోపణలపై తొలిసారి స్పందించిన ప్రధాని మోదీ
అమెరికా ఖలిస్థానీ నాయకుడు, వేర్పాటువాద గ్రూపు సిక్కు ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్య కుట్ర కేసులో భారత అధికారి ప్రమేయం ఉందన్న ఆరోపణలపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా స్పందించారు. ఏ దేశమైనా మాకు సమాచారం ఇస్తే తప్పకుండా పరిశీలిస్తామని ప్రధాని మోదీ అన్నారు. బ్రిటన్ వార్తాపత్రిక ఫైనాన్షియల్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక విషయాలను వెల్లడించారు. అమెరికా ఇచ్చిన ఆధారాలను కచ్చితంగా పరిశీలిస్తామన్నారు. పాశ్చాత్య దేశాలు వేర్పాటువాద అంశాలను ప్రోత్సహించవద్దని మోదీ కోరారు. భారత్ ఆందోళనలను అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇతర దేశాల్లో స్థిరపడిన ఉగ్రవాద మూకల కార్యకలాపాల పట్ల తాము ఆందోళన చెందుతున్నామని ప్రధాని మోదీ అన్నారు.
సిక్కు వేర్పాటువాదుల కార్యకలాపాలను సీరియస్‌గా తీసుకోవాలి: మోదీ
విదేశాల్లో దాక్కున్న కొన్ని తీవ్రవాద గ్రూపులు భావప్రకటనా స్వేచ్ఛ ముసుగులో బెదిరింపులు, హింసకు పాల్పడుతున్నాయని మోదీ పేర్కొన్నారు. 2020లో గురుపత్‌వంత్ సింగ్ పన్నును భారత్ ఉగ్రవాదిగా ప్రకటించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కెనడా, అమెరికా వంటి దేశాల్లో అతను తలదాచుకుంటున్నాడన్నారు. సిక్కు వేర్పాటువాదుల కార్యకలాపాలను సీరియస్‌గా తీసుకోవాలని పాశ్చాత్య దేశాలకు భారత్ చాలాసార్లు విజ్ఞప్తి చేసినట్లు మోదీ గుర్తు చేసారు. అదే సమయంలో, ఈ కేసు తర్వాత అమెరికాతో సంబంధాలు చెడిపోయాయన్న చర్చను ప్రధాని పూర్తిగా తోసిపుచ్చారు. ఇరుదేశాల సంబంధాలను బలోపేతం చేసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు మద్దతుగా నిలుస్తున్నారన్నారు.