Ayodhya Ram Mandir: రామమందిర ప్రారంభోత్సవానికి ముందు ప్రధాని '11 రోజుల ప్రత్యేక అనుష్ఠానం'
జనవరి 22న అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి ముందు, ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రత్యేక సందేశం ఇచ్చారు. నేటి నుంచి 11 రోజుల ప్రత్యేక అనుష్ఠానాన్ని అనుసరిస్తానని వెల్లడించారు.ఈ మేరకు ఆడియో సందేశాన్ని తన అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేశారు. పిఎం మోడీ ఈ మహోన్నత ఘట్టాన్ని కనులారా వీక్షించే అవకాశం కలగడం తన అదృష్టమని పేర్కొన్నారు. ఇందుకు ప్రజలందరి ఆశీస్సులు కోరుతున్నట్లు తెలిపారు."రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ'కు ఇంకా 11 రోజులు మాత్రమే మిగిలి ఉంది,సంప్రోక్షణ సమయంలో భారతదేశ ప్రజల తరఫున ప్రతినిధిగా ఉండటం నా అదృష్టం. దీనిని దృష్టిలో ఉంచుకుని, నేను ఈ రోజు నుండి 11 రోజుల పాటు ప్రత్యేక పూజను ప్రారంభిస్తున్నాను" అని ఆయన చెప్పారు.
దేశవ్యాప్తంగా 7,000 మందికి పైగా ఆహ్వానితులు
ప్రస్తుతం నేను ఎంతో ఉద్వేగంతో ఉన్నాను.నా మనసులో మొదటిసారిగా ఇలాంటి భావాలు మెదులుతున్నాయి.దేవుడి ఆశీస్సుల వల్లే కొన్నివాస్తవ రూపం దాల్చుతాయి.ఈ ప్రారంభోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులందరికీ ఒక పవిత్రమైన సందర్భం'అని ప్రధాని మోదీ సందేశం ఇచ్చారు. 'ప్రాణ ప్రతిష్ఠ' వేడుకకు సంబంధించిన గ్రంథాలలో వివరించిన కఠినమైన మార్గదర్శకాలను ప్రధాని అనుసరిస్తారని అధికారులు తెలిపారు. అయోధ్యలోని రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీ,ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్,ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ వేడుక ఆహ్వానితులలో రామ మందిరాన్ని నిర్మించిన కార్మికుల కుటుంబాలు కూడా ఉన్నాయి. ఆలయ ట్రస్ట్, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం ఆహ్వానితుల జాబితాలో బాలీవుడ్ ప్రముఖులు, క్రికెటర్లు, పారిశ్రామికవేత్తలతో సహా 7,000 మందికి పైగా ఉన్నారు.