
PM Modi: ఆపరేషన్ సిందూర్ పై చర్చ.. ఐసీయూలో పాక్ ఎయిర్ బేస్‌లు,అణు బెదిరింపులు చెల్లవని హెచ్చరించాం : మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
ఉగ్రవాదుల్ని నేలమట్టం చేసిన సందర్భంగా దేశం అంతటా విజయోత్సవాల వాతావరణం నెలకొన్నదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంగా వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడం, భారత సేనల శౌర్య, ప్రతాపాల ప్రదర్శన తర్వాత విజయోత్సవాలు చేసుకుంటున్నామన్నారు. దేశంలోని 140 కోట్ల ప్రజల ఐక్యత, సంకల్ప బలమే ఈ విజయానికి మూలమని పేర్కొన్నారు. ఈ విజయోత్సవాలు ఆ ఉత్సాహాన్ని ప్రతిబింబిస్తున్నాయని ప్రధాని అన్నారు. లోక్‌సభలో 'ఆపరేషన్ సిందూర్'పై జరిగిన తీవ్ర చర్చకు ఆయన సమాధానమిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
వివరాలు
పహల్గాం దాడి లక్ష్యం.. మతాల మధ్య చిచ్చు పెట్టడమే
పహల్గాం ఘటన ఉద్దేశ్యపూర్వకంగా మతాల మధ్య విభేదాలు రెచ్చగొట్టడానికే జరిపిన దాడిగా అభివర్ణించిన మోదీ, దానికి తగిన ప్రత్యుత్తరం ఇవ్వడం తమ బాధ్యతగా భావించినట్టు చెప్పారు. ఈ దాడి అనంతరం ఉగ్రవాదుల్ని తుడిచిపెట్టేందుకు తాము ప్రతిజ్ఞచేసిన విషయాన్ని గుర్తు చేశారు. దేశద్రోహులకు ఊహించలేని స్థాయిలో శిక్షలు విధిస్తామని అప్పట్లో స్పష్టంగా ప్రకటించామని అన్నారు. ఉగ్రవాదాన్నిసమూలంగా నశింపజేయాలన్న అంశంపై అఖిలపక్ష సమావేశాల్లోనూ చర్చించినట్టు తెలిపారు.
వివరాలు
పాక్ ఎయిర్‌బేస్‌లు తీవ్రంగా దెబ్బతిన్నాయని వ్యాఖ్య
పాక్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడం ద్వారా భారత్ తన ధైర్యాన్ని ప్రదర్శించిందని మోదీ అన్నారు. పాక్ భూభాగంలోకి వెళ్లి ఉగ్రస్థావరాల్ని ధ్వంసం చేసామన్నారు. పాక్ ఎయిర్ బేస్‌లు ఇప్పటికీ ఐసీయూలో ఉన్నాయన్నారు. అణుబాంబులు బెదిరింపులు చెల్లవని పాక్‌ను హెచ్చరించామన్నారు. ఓవైపు భారత చర్యలకు ప్రపంచవ్యాప్తంగా విశేష స్పందన లభించిందని, ఐక్యరాజ్య సమితి సభ్యులైన 193 దేశాల్లో 190 దేశాలు 'ఆపరేషన్ సిందూర్'కు మద్దతుగా నిలిచాయని చెప్పారు. మరొవైపు పాకిస్థాన్‌కు కేవలం మూడు దేశాలే అండగా ఉన్నాయని తెలిపారు.
వివరాలు
జవాన్ల త్యాగాలను తగ్గించరాదని హెచ్చరిక
కాంగ్రెస్ పార్టీ మాత్రం సైనికుల పరాక్రమాలను తక్కువ చేస్తోందని ఆరోపించారు. రాజకీయ స్వార్థాల కోసం వీర జవాన్ల పరాక్రమాన్ని తక్కువగా చూపించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. దేశ సైనికుల త్యాగాల పట్ల కనీస గౌరవం కనబర్చకపోవడం బాధాకరమని అన్నారు. భారత రక్షణ దళాల శక్తి, సామర్థ్యాలపై తనకు పూర్తిగా విశ్వాసం ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. సైనికులకు తగిన స్వేచ్ఛను కల్పించామని, ఎప్పుడూ దేశ ప్రజల పక్షానే తాము నిలిచామన్నారు. భారతీయుల భావోద్వేగాలకు తాను స్పందిస్తూ ముందుకు సాగుతున్నానని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో దేశ ప్రజలు తనపై ఉంచిన నమ్మకానికి తాను రుణపడి ఉంటానని చివరగా ఆయన ధన్యవాదాలు తెలిపారు.