5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్: నేడు పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం
ఈ ఏడాది చివర్లో జరగనున్న 5రాష్ట్రాల(మిజోరం, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ) అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ దృష్టి సారించింది. గెలుపే లక్ష్యంగా వ్యూహరచన చేయడానికి బీజేపీ అత్యున్నత నిర్ణయాధికార విభాగం కేంద్ర ఎన్నికల కమిటీ బుధవారం సాయంత్రం దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశం కానుంది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర ఎన్నికల ప్యానెల్ సభ్యులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో అభ్యర్థుల ఎంపికతో పాటు, ఎన్నికల వ్యూహాన్ని రూపొందించడానికి కీలకమైన చర్చలు జరగనున్నాయి.
విపక్షాల పాలిత రాష్ట్రాలపైనే ప్రత్యేక దృష్టి
వాస్తవానికి బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ చాలా అరుదుగా సమావేశమవుతుంది. ఎన్నికల నోటిఫికేషన్ తర్వాతే కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై అభ్యర్థుల ఎంపికపై చర్చస్తుంది. అయితే కర్ణాటకలో బీజేపీ ఓడిపోయిన నేపథ్యంలో అప్రమత్తమైన అధినాయకత్వం.. ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకూడదని నిర్ణయించింది. ఈ ఏడాది చివర్లో జరగనున్న 5 అసెంబ్లీ ఎన్నికలు పెను సవాల్‌గా మారిన నేపథ్యంలో ముందస్తు ప్రణాళికలు రచించేందుకు ముఖ్య నాయకులు నేడు సమావేశం అవుతున్నారు. ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణ విపక్షాల పాలిత రాష్ట్రాలు కావడంతో ఈ సమావేశంలో వీటిపై దృష్టి సారించే అవకాశం ఉంది.
ఆ రాష్ట్రాల్లో గెలుపు అంత సులువేం కాదు
మధ్యప్రదేశ్, మిజోరంలో అధికారాన్ని నిలబెట్టుకొని, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణలో ఈసారి ఎలాగైనా గెలవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. కానీ అది అంత సులువు కాదు. తెలంగాణలో బీజేపీకి ఈ ఎన్నికల్లో కొన్ని అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉంది కానీ, అధికారంలోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదని నిపుణులు చెబుతున్నారు. మిజోరంలో అధికార పార్టీ అయిన ఎంఎన్‌ఎఫ్ లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంలో మిత్రపక్షమైన బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేసింది. మణిపూర్ విషయంలో ఈ రెండు పార్టీల మధ్య దూరం పెరిగింది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ బలంగా ఉంది. ఇక్కడ రెండు పార్టీల మధ్య పోరు నువ్వా-నేనా అన్న చందంగా ఉంది. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉండగా, బీజేపీ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.
బీజేపీ బలహీనంగా ఉన్న స్థానాలపైనే చర్చ
ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల ఫలితాలు ప్రభావం తర్వాత జరిగిన జనరల్ ఎలక్షన్స్‌పై ఉండే అవకాశం ఉంటుంది. అందుకే ఈ ఎన్నికల్లో సత్తాచాటాలని బీజేపీ భావిస్తోంది. బీజేపీ బలహీనంగా ఉన్న స్థానాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరుగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ బలహీనంగా ఉన్న సీట్లలో అభ్యర్థులను ముందుగానే ఖరారు చేయాలని, తద్వారా వారికి సన్నద్ధమయ్యేందుకు తగినంత సమయం లభిస్తుందని బీజేపీ భావిస్తోంది. ఈ సమావేశంలో ఎన్నికల ఎజెండా, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రచారం, ఇతర సంబంధిత అంశాల గురించి కూడా చర్చిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.