
Namo Bharat Rapid Rail:దేశంలో 16 బోగీలతో తొలి నమో భారత్ ర్యాపిడ్.. 24న పట్టాలెక్కనున్న ఈ రైలు ఫీచర్లు తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో తొలిసారి 16 బోగీలతో కూడిన నమో భారత్ ర్యాపిడ్ రైలు ప్రయాణానికి సిద్ధమైంది.
ఈ రైలు ఏప్రిల్ 24న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది.
బిహార్‌లో జయ్‌నగర్ నుంచి పట్నా వరకు ఈ రైలు సేవలందించనుందని కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ తెలిపింది.
గత ఏడాది సెప్టెంబర్‌లో అహ్మదాబాద్ - భుజ్ మార్గంలో మొదటిసారి నమో భారత్ రైలు ప్రవేశపెట్టినప్పటికీ, అప్పట్లో కేవలం 12 బోగీలు మాత్రమే ఉన్నాయి.
ప్రయాణికుల అవసరాల మేరకు కోచ్‌ల సంఖ్యను పెంచాలని నిర్ణయించిన రైల్వే శాఖ తాజాగా 16 బోగీలతో కూడిన కొత్త నమో భారత్ రైలును తయారు చేసింది.
వివరాలు
గరిష్ఠంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో..
ఈ నూతన నమో భారత్ రైలు పునర్వ్యవస్థీకరించబడిన ఆధునిక సౌకర్యాలతో అలంకరించబడింది.
ప్రధానమంత్రి మోదీ ఈ రైలును గురువారం పచ్చ జెండా ఊపి ప్రారంభించనున్నట్లు రైల్వే బోర్డులో ఉన్న సీనియర్ అధికారి దిలీప్ కుమార్ వెల్లడించారు.
ఇది 16 కోచ్‌లతో నడిచే దేశంలోని తొలి నమో భారత్ రైలు కావడం విశేషం.
ఈ రైలు గరిష్ఠంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతుంది. ఫలితంగా ప్రయాణ సమయం దాదాపు సగానికి తగ్గుతుంది.
ఉద్యోగాలు, వ్యాపారాలు, విద్య కోసం ఉత్తర బీహార్ నుంచి పట్నాకు వెళ్ళే ప్రజలకు ఇది వేగవంతమైన, సురక్షితమైన, సౌకర్యవంతమైన రవాణా మార్గంగా నిలవనుంది.
వివరాలు
1,000 మందికి పైగా నిలబడి ప్రయాణించే అవకాశం
రైలులో అన్ని బోగీలు శీతలీకృత (ఎయిర్ కండీషన్డ్) కోచ్‌లే. సుమారు 2,000 మంది కూర్చొని ప్రయాణించగల సామర్థ్యం ఈ రైలుకు ఉంది.
అదనంగా, ఇంకా 1,000 మందికి పైగా నిలబడి ప్రయాణించే అవకాశం కూడా ఉంది. నిలబడి ఉన్న ప్రయాణికులు సురక్షితంగా ఉండేందుకు హ్యాండ్ గ్రిప్‌లు, పట్టీలు, స్తంభాలు ఏర్పాటు చేశారు.
ఈ ర్యాపిడ్ రైలు మధుబని, సక్రీ, దర్భంగా, సమస్తిపుర్, బరౌని, మొకమ స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది.
ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని మోడరన్ సీటింగ్ వ్యవస్థను అందించారు.
వివరాలు
రూట్ మ్యాప్‌లు కూడా అందుబాటులో..
ప్రతి బోగీలో టైప్-సి, టైప్-ఎ చార్జింగ్ సాకెట్లు, ఫుల్ ఏసీ కేబిన్లు, మాడ్యులర్ ఇంటీరియర్ డిజైన్, స్వచ్ఛమైన టాయిలెట్ లభ్యమవుతాయి.
రైలులో కవచ్ భద్రతా సాంకేతికత, సీసీటీవీలు, అగ్ని ప్రమాదాన్ని ముందే గుర్తించే వ్యవస్థను ఏర్పాటు చేశారు.
అలాగే, ఇంజిన్ రెండు వైపులా ఉండే పుష్-పుల్ మెకానిజంతో తయారు చేశారు. రైలు ఏ స్టేషన్ వద్ద ఉందో చూపించే రూట్ మ్యాప్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.