రేపు యశోభూమిని ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. పుట్టిన రోజు సందర్భంగా కేంద్రం ఏర్పాట్లు
ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం కేంద్ర ప్రభుత్వం కీలక ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ద్వారక సెక్టార్ 21లో నిర్మించిన అత్యాధునిక వసతులతో కూడిన 'యశోభూమి'ని మోదీ ప్రారంభించనున్నారు. అనంతరం జాతికి అంకితం చేయనున్నారు. యశోభూమి - ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (IICC)ని ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించనున్నారు. ద్వారక సెక్టర్ 21లో అత్యాధునిక సౌకర్యాలతో 'యశోభూమి'ని నిర్మించిన ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (ఐఐసిసి) ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ద్వారకా సెక్టార్ 21 నుంచి ద్వారకా సెక్టార్ 25 వద్దగల కొత్త మెట్రో స్టేషన్ వరకు దిల్లీ ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ లైన్ కు మోదీ పచ్చజెండా ఊపనున్నారు.
యశోభూమి కన్వెన్షన్ సెంటర్ స్పెషాలిటీ
యశోభూమి కేంద్రాన్ని రూ. 4,400 కోట్ల ఖర్చుతో 73 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. ప్రధాన ఆడిటోరియం సహా 15 సమావేశ గదులున్నాయి. గ్రాండ్ బాల్‌రూమ్, 11 వేల మంది ప్రతినిధులు కూర్చునే సామర్థ్యంతో 13 మీటింగ్ హాల్స్ ను నిర్మించారు. దాదాపుగా 2,500 మంది అతిథులకు వసతి కల్పించేందుకు విశాలమైన బాల్‌రూమ్‌ని సిద్ధం చేశారు. భద్రతా కోసం అత్యాధునిక ఏర్పాట్లను పూర్తి చేశారు. కన్వెన్షన్ సెంటర్‌లో అదనంగా 1,07,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. ప్లీనరీ హాల్ దాదాపు 6 వేల మంది అతిథులు కూర్చునే సామర్థ్యంతో నిర్మించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద సమావేశ మందిరం
ఈ మేరకు మొత్తం 8.9 లక్షల చదరపు మీటర్ల వైశాల్యంలో 1.8 లక్షల చదరపు మీటర్ల నిర్మాణంతో ప్రపంచంలోనే అతిపెద్ద MICE (సమావేశాలు, ప్రోత్సాహకాలు, ప్రదర్శనలు)లతో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. యశోభూమి ద్వారకా సెక్టార్-25 మెట్రో స్టేషన్ ప్రారంభోత్సవం ద్వారకా సెక్టర్ 21 నుంచి ద్వారకా సెక్టర్ 25 వరకు గల కొత్త మెట్రో స్టేషన్ ను దిల్లీ ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ లైన్ పొడిగింపును కూడా మోదీ జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం అదే రోజు (ఆదివారం) మధ్యాహ్నం 3 గంటల నుంచి రాకపోకలకు అనుమతిస్తామని దిల్లీ మెట్రో అధికారులు పేర్కొన్నారు.