
Narendra Modi: మే 2వ తేదీన అమరావతిలో ప్రధాని పర్యటన..
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం, రాజధాని అమరావతి పునర్నిర్మాణంపై పూర్తి దృష్టి సారించింది.
ఇప్పటికే వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అనుమతులను సీఆర్డీఏ అథారిటీతో పాటు రాష్ట్ర కేబినెట్ కూడా మంజూరు చేసింది.
ఇదిలా ఉండగా, గతంలో అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఇప్పుడు మళ్లీ అమరావతిలో జరుగుతున్న పునర్నిర్మాణ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
మే 2వ తేదీన ఆయన అమరావతిలో పర్యటించనున్నారు. ఈ పర్యటన అమరావతి పునర్నిర్మాణంలో ఒక భాగంగా జరుగనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, ప్రధాన రహదారుల నిర్మాణాన్ని వచ్చే మూడు సంవత్సరాల్లో పూర్తిచేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన వివరించారు.
వివరాలు
మంత్రులతో చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ
ఇంకా, ఇంఛార్జ్ మంత్రుల పర్యటనల విషయంలో మూడు పార్టీల నేతలు సమష్టిగా పాల్గొనాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
రెవెన్యూ సంబంధిత సమస్యలను త్వరితంగా పరిష్కరించాలనీ, వీటిలో పోలీసుల జోక్యం వల్ల ఏర్పడుతున్న సమస్యలను కూడా తక్షణమే పరిష్కరించాలని సూచించారు.
సూర్యఘర్ పథకాన్ని మరింత వేగంగా అమలు చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
మే 2వ తేదీన ప్రధాని మోడీ రాష్ట్రానికి రానున్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి మంత్రులకు తెలియజేశారు .
కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత,చంద్రబాబు మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా కొన్ని అంశాలపై తన అసహనాన్ని వ్యక్తం చేశారు."ఎన్ని సార్లు చెప్పినా కొన్ని విషయాల్లో మార్పు రావడం లేదేంటి?" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వివరాలు
మంత్రుల పనితీరుపై అసంతృప్తి
తిరుపతిలో గోవుల మృతిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవాస్తవ ప్రచారాన్ని ఎదుర్కొనడంలో మంత్రులు విఫలమయ్యారని చంద్రబాబు మండిపడ్డారు.
"దేశంలో ఎక్కడా అమలు చేయలేని సంక్షేమ కార్యక్రమాలు మన ప్రభుత్వం అమలు చేస్తోంది. అయితే ప్రజల్లోకి వాటిని తీసుకెళ్లడంలో మంత్రులు విఫలం అవుతున్నారని దుయ్యబట్టారు. ప్రతి జిల్లా ఒక యూనిట్‌గా ఉండేలా పార్టీ, ప్రభుత్వం, మంత్రులు సమన్వయంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వరకు చేర్చాలని చంద్రబాబు ఆదేశించారు.
అంతేకాక, మంత్రుల పనితీరులో ఇప్పటికీ మార్పు కనిపించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
వ్యక్తిగత కార్యదర్శులు, ఓఎస్‌డీలు చేస్తున్న తప్పుల ప్రభావం ప్రభుత్వంపై పడుతుండటంతో, అలాంటి లోపాలను సరిదిద్దుకోవాలని ఆయన గట్టి హెచ్చరికలు జారీ చేశారు.