
NTR: తెలుగునాట రాజకీయ ప్రభంజనం; ఎన్టీఆర్ పొలిటికల్ ప్రస్థానం సాగిందిలా
ఈ వార్తాకథనం ఏంటి
1982, మార్చికి ముందు వరకు నందమూరి తారక రామారావు( ఎన్టీఆర్) అంటే తెలుగు తెరపై దేవుడు. తెలుగు వారికి ఆయనే రాముడు, కృష్ణుడు.
కానీ 1982, మార్చి తర్వాత ఎన్టీఆర్ అంటే ఓ రాజకీయ ప్రభంజనం.
అప్పటిదాకా గుర్తింపుకు నోచుకోని తెలుగువారి ఆత్మగౌరవ నినాదం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ రాజ్యానికి తొలి అడుగు వేసింది ఎన్టీఆర్. రూ. 2 కిలో బియ్యం పథకంతో లక్షల మంది పేదల కడుపు నింపి తెలుగు ప్రజల హృదయాల్లో నిజమైన హీరోగా చెరగని ముద్ర వేసింది ఎన్టీఆర్.
తెలుగు నెలపై కాంగ్రేసేతర తొలి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 100వ పుట్టిన రోజు(మార్చి, మే 28) సందర్భంగా ఆయన గురించి ప్రత్యేక కథనం.
తెలుగు
పార్టీ స్థాపించిన 9నెలల్లో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్
1982 ఫిబ్రవరిలో హైదరాబాద్ విమానాశ్రయంలో అప్పటి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాజీవ్ గాంధీ మాజీ ముఖ్యమంత్రి టి.అంజయ్యను అవమానించిన సంఘటన ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడానికి మొదటి ప్రేరణగా నిలిచిందనే చెప్పాలి.
ఈ నేపథ్యంలోనే తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో 1982 మార్చిలో 'తెలుగుదేశం పార్టీ'ని ఎన్టీఆర్ ప్రకటించారు.
అంతేకాకుండా, పార్టీని పెట్టిన కేవలం 9నెలల్లోనే దశాబ్దాలుగా తెలుగు నెలపై ఏకఛత్రాధిపత్యంగా పాలన సాగిస్తున్న కాంగ్రెస్‌కు చెమటలు పట్టించారు.
1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 294 స్థానాలకు గానూ 201 సీట్లు గెలుచుకుని కాంగ్రెస్ పార్టీని కోలుకోలేని దెబ్బతీశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలి కాంగ్రేసేతర ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు.
ఎన్టీఆర్
సినిమా ఇమేజ్‌ను పొలిటికల్ ఇమేజ్‌గా మార్చుకున్న ఎన్టీఆర్
అంజయ్యను రాజీవ్ గాంధీ అవమానించడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రులను కాంగ్రెస్ డోర్ మ్యాట్లు మార్చినట్లు మార్చేది. ఇలాంటి పలు సంఘటనలు ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ పెట్టడానికి పురిగోల్పోయి.
ఎన్టీఆర్ పార్టీని ప్రకటించినప్పుడు కాంగ్రెస్ నాయకులు లైట్ తీసుకున్నారు. అతను సీరియస్ పొలిటిషయన్ కాదని కొట్టిపారేశారు. రానురానూ ఎన్టీఆర్ ప్రత్యర్థుల మాటలు తప్పని నిరూపించారు.
చైతన్య రథం ద్వారా ప్రజల్లోకి వెళ్లి, అప్పటిదాకా తనకున్న సినిమా ఇమేజ్‌ను పొలిటికల్ ఇమేజ్‌గా మార్చుకోవడంలో విజయవంతం అయ్యారు.
రోడ్డుపక్కనే స్నానాలు చేయడం, భోజనం చేయడం, రోడ్డుపైనే నిద్రపోవడం లాంటివి ఎన్టీఆర్‌ను మాస్ లీడర్ చేశాయి.
దీంతో ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగు దేశం పార్టీ ఘన విజయం సాధించింది.
ఎన్టీఆర్
రెండుసార్లు వెన్నుపోటుకు గురైన ఏకైక నాయకుడు
13ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ఎన్టీఆర్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. మొదటిసారి అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే ఎన్టీఆర్ 1984ఆగస్టులో తన సహచరుడు నాదెండ్ల భాస్కర్‌రావు నుంచి తొలిసారి వెన్నుపోటును ఎదుర్కొన్నారు.
ఎన్టీఆర్ ఆరోగ్యం బాగాలేక చికిత్స కోసం అమెరికాకు వెళ్లగా, అప్పటి గవర్నర్ రాంలాల్ మద్దతుతో నాదెండ్ల భాస్కర్ రావు సీఎం కుర్చి ఎక్కారు.
చికిత్స పూర్తయ్యాక ఎన్టీఆర్ తిరిగి వచ్చాక, మెజారిటీ ఎమ్మెల్యేలు ఎన్టీఆర్‌కు మద్దతు ఇవ్వడంతో భాస్కర్ రావు ప్రభుత్వం కూలిపోయింది.
ఆ తర్వాత ఎన్టీఆర్ రాష్ట్రమంతా తిరిగి మళ్లీ 1985లో అధికారంలోకి వచ్చారు.
1995లో ఎన్టీఆర్ అల్లుడు చంద్రాబాబు నాయుడు రూపంలో మరోసారి వెన్నుపోటుకు గురయ్యారు. ఫలితంగా దేశంలోనే రెండుసార్లు వెన్నుపోటుకు గురైనా ఏకైక సీఎంగా ఎన్టీఆర్ నిలిచారు.
ఎన్టీఆర్
సీఎంగా ఎన్టీఆర్ సంక్షేమ పథకాలు, సంచలన నిర్ణయాలు
ఎన్టీఆర్ తొలిసారి సీఎం అయ్యాక రూ.2 కిలో బియ్యాన్ని ప్రవేశ పెట్టారు. మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేశారు. పేదలకు ఇళ్ల నిర్మాణం, మధ్యపాన నిషేదం లాంటి నిర్ణయాలు తీసుకున్నారు.
1985-1989 మధ్య ఎన్టీఆర్ సీఎంగా సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో కొన్ని వివాదాస్పదం కూడా అయ్యాయి.
పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణను 58 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాలకు తగ్గించడం చాలా వివాదాస్పదమయ్యాయి.
ఎన్టీఆర్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు 1989లో ఎన్నికల్లో ఎన్టీఆర్ అధికారాన్ని కోల్పోవడానికి కారణం అయ్యాయి.
ఎన్టీఆర్
నేషనల్ ఫ్రంట్ ఏర్పాటులో కీలక పాత్ర
1989 ఎన్నికల్లో ఓడిపోయినా ఎన్టీఆర్ రాజకీయంగా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఆ తర్వాత దేశ రాజకీయాలపై దృష్టి సారించారు.
డీఎంకే, అసోం గణపరిషత్‌తో సహా కాంగ్రెసేతర పార్టీల కూటమి అయిన నేషనల్ ఫ్రంట్ ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారు.
తద్వారా ఆయన దేశ రాజకీయాల్లో తనదైన ముద్రను వేయగలిగారు.
నేషనల్ ఫ్రంట్‌కు బీజేపీ, లెఫ్ట్ ఫ్రంట్ మద్దతు కూడా లభించడంతో 1989 సార్వత్రిక ఎన్నికల్లో రాజీవ్ గాంధీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
ఎన్టీఆర్
లక్ష్మిపార్వతి వర్సెస్ చంద్రబాబు
ఎన్టీఆర్ భార్య బసవతారకం క్యాన్సర్‌తో మరణించిన ఎనిమిదేళ్ల తర్వాత అంటే 1993లో లక్ష్మీపార్వతిని వివాహం చేసుకున్నారు.
ఎన్టీఆర్ జీవితంలోకి ఆమె ప్రవేశించిన తర్వాత ఆయనకి ,ఆయన కుటుంబ సభ్యులకు మధ్య దూరం పెరిగింది.
ఈ క్రమంలో డిసెంబర్ 1994లో రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఆర్ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబం, పార్టీలో వివాదాలు మరింత ముదిరాయి.
లక్ష్మీ పార్వతి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్న ఊహాగానాల నేపథ్యంలో, చంద్రబాబు అలర్ట్ అయి అమె కంటే ముందే 1995 ఆగస్టులో తిరుగుబాటు చేశారని అప్పట్లో ప్రచారం జరిగింది.
ఈ క్రమంలో మెజార్టీ ఎమ్మెల్యేలు చంద్రబాబు వెంట ఉండటంతో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగారు. ఆ తర్వాత చంద్రబాబు సీఎం అయ్యారు.