కేసీఆర్‌ను గద్దె దించేందుకే కాంగ్రెస్‌లోకి.. పొంగులేటి
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సహా 35 మంది బీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. జులై 2న ఖమ్మం జరిగే బహిరంగ సమావేశంలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. దిల్లీలో సోమవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పొంగులేటి, జూపల్లి సంయుక్తంగా మాట్లాడారు. మునుపెన్నడూ లేని విధంగా ఖమ్మంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నట్లు పొంగులేటి ప్రకటించారు. కేసీఆర్‌ను గద్దె దించేందుకే తాము కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. సీఎం కేసీఆర్ నిర్వహించిన సభ కంటే పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా పాల్గొంటారని పొంగులేటి వెల్లడించారు.
భారత్ జూడో యాత్రతో పెరిగిన రాహుల్ గాంధీ ఇమేజ్: పొంగులేటి
జూపల్లి, తాను కొత్త పార్టీ పెట్టాలని భావించామని, కానీ ప్రభుత్వ ఓటు చీలుతుందని భావించి, కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు పొంగులేటి పేర్కొన్నారు. భారత్ జూడో యాత్రతో దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ఇమేజ్ పెరిగినట్లు చెప్పారు. కర్ణాటకలో సాధించిన విజయంతో తెలంగాణలోనూ కాంగ్రెస్‌కు ఊపు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది చివర్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. అంతకుముందు, తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో పాటు పొంగులేటి, జూపల్లి అనుచరులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) కెసి వేణుగోపాల్, తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఎ రేవంత్ రెడ్డి సమక్షంలో రాహుల్ గాంధీని కలిశారు.