Page Loader
Telangana: హరిత ఇంధన ఉత్పత్తి, వినియోగానికి తెలంగాణలో పుష్కలంగా అవకాశాలు.. ఎంఎన్‌ఆర్‌ఈ వెల్లడి
హరిత ఇంధన ఉత్పత్తి, వినియోగానికి తెలంగాణలో పుష్కలంగా అవకాశాలు

Telangana: హరిత ఇంధన ఉత్పత్తి, వినియోగానికి తెలంగాణలో పుష్కలంగా అవకాశాలు.. ఎంఎన్‌ఆర్‌ఈ వెల్లడి

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 24, 2024
01:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో హరిత ఇంధన ఉత్పత్తి,వినియోగానికి విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ పరిశోధనలో రాష్ట్రాల వారీగా సౌర, పవన విద్యుత్తు, అలాగే పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టులు (పీఎస్‌పీ) ద్వారా హరిత ఇంధన ఉత్పత్తి సామర్థ్యం గురించి కేంద్ర నూతన ఇంధన వనరుల మంత్రిత్వశాఖ వివరాలను సేకరించింది. తెలంగాణలో రోజుకు 35,100 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంది, కానీ ప్రస్తుతం ఉన్న ప్లాంట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం కేవలం 6,200 మెగావాట్లనే ఉన్నట్లు నిర్ధారించింది.

వివరాలు 

రెట్టింపు సామర్థ్యం

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ సాధారణ విద్యుత్ గరిష్ఠ డిమాండ్‌ 15,747 మెగావాట్లుగా ఉంది. హరిత ఇంధనాన్ని పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేస్తే, ఇది రెట్టింపు స్థాయికి పెరిగి మరింత విద్యుత్ అందుబాటులోకి రానుందని అంచనా. 2024-25 ఆర్థిక సంవత్సరంలో హరిత ఇంధన ఉత్పత్తి పెంచుతున్న రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు, రాయితీలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్‌లో రూ.18,853 కోట్లు కేటాయించింది. కేంద్ర నూతన, పునరుద్ధరణీయ ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ (ఎంఎన్‌ఆర్‌ఈ) ప్రకారం, 2030 నాటికి దేశంలో హరిత ఇంధన సామర్థ్యాన్ని 500 గిగావాట్లకు పెంచడమే లక్ష్యం. తెలంగాణ రాష్ట్రంలో సౌర విద్యుత్ ఉత్పత్తి పెంపునకు పలు కేంద్ర పథకాలు అందుబాటులో ఉన్నట్లు కూడా ఎంఎన్‌ఆర్‌ఈ వెల్లడించింది.

వివరాలు 

తెలంగాణలో స్పందన తక్కువ: ఎంఎన్‌ఆర్‌ఈ

ఎంఎన్‌ఆర్‌ఈ ప్రకారం, 6 నెలల క్రితం ప్రారంభించిన 'ప్రధానమంత్రి సూర్యఘర్‌ యోజన' కింద కోటి ఇళ్ల పైకప్పు (రూఫ్‌టాప్) సౌర విద్యుత్ ఏర్పాటుకు రాయితీలు ప్రకటించినప్పటికీ, రాష్ట్రంలో కేవలం 4,300 ఇళ్లకు మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. ఇదే విధంగా, పీఎం కుసుమ్‌ పథకంలో, బీడు భూములు, వ్యవసాయబోర్ల వద్ద సౌర విద్యుత్ ఏర్పాటుకు ప్రోత్సాహం ఇచ్చినా,తెలంగాణలో స్పందన తక్కువగానే ఉందని ఎంఎన్‌ఆర్‌ఈ తెలిపింది. పంటలు లేని సమయంలో బోర్ల వద్ద ఉత్పత్తయ్యే సౌర విద్యుత్‌ను రాష్ట్ర గ్రిడ్‌కు సరఫరా చేస్తే, యూనిట్‌కు రూ.3కు పైగా డిస్కంలు రైతులకు చెల్లించవలసి ఉంటుంది, దీనివల్ల రైతులకు అదనంగా ఆదాయం వస్తుంది. అయినప్పటికీ, ఈ పథకంపై పెద్దగా స్పందన లేదని ఎంఎన్‌ఆర్‌ఈ వివరించింది.

వివరాలు 

రాష్ట్రంలో పీఎస్‌పీల ఏర్పాటు 

ఇక తెలంగాణలో నూతన ఇంధన పాలసీ రూపకల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అంతేకాకుండా, జాతీయ జల విద్యుత్ ఉత్పత్తి సంస్థ కూడా రాష్ట్రంలో పీఎస్‌పీల ఏర్పాటు కోసం సహకరించడానికి ముందుకొచ్చినట్లు అధికారవర్గాలు తెలిపాయి.