
Nitish Kumar : దేశానికి నితీష్ రెండో గాంధీ.. పట్నాలో వెలిసిన పోస్టర్లు
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్‌లో సీఎం నితీష్ కుమార్ పేరిట పోస్టర్లు వెలిశాయి. ఆయనే దేశానికి రెండో గాంధీ అంటూ పట్నాలో ఆదివారం పోస్టర్లు కనిపించాయి.
జేడీ(యూ) నేతలు ఏర్పాటు చేసిన ఈ పోస్టర్లపై దుమారం రేగుతోంది. దేశానికి నితీష్ కుమారే సమానత్వ పాఠం బోధించారని పోస్టర్‌లో ముద్రించారు.
మరోవైపు సామాజిక సంస్కరణల(Social Reforms) కోసం బిహార్ ముఖ్యమంత్రి నితీష్ ఎన్నో చర్యలు చేపట్టారని పార్టీ నేతలు అంటున్నారు.
ఈ మేరకు ఆయన, మహాత్మా గాంధీ బాటలోనే పయనిస్తున్నారన్నారు. నితీష్ కుమార్‌ను రెండో గాంధీగా అభివర్ణిస్తున్న పోస్టర్లపై పలు పార్టీలు స్పందించాయి.
Details
ప్రధాని పదవి కోసం లాలూ ఒడిలో కూర్చున్న నితీష్ : బీజేపీ
సీఎం నితీష్ కుమార్ భక్తులే ఈ పోస్టర్లు అతికించారని ఆర్జేడీ నేత శివానంద్ తివారీ అన్నారు. ఈ రకంగా మహాత్మా గాంధీని కించపరచడం నితీష్ భక్తులు మానుకోవాలని హితబోధ చేశారు.
గాంధీ వంటి మహానుభావులు వెయ్యి ఏళ్లకు ఒక్కరు మాత్రమే పుడతారని ఆయన అన్నారు. మరోవైపు నితీష్ కుమార్ పోస్టర్‌పై బీజేపీ విమర్శలు గుప్పించింది.
నితీష్ కుమార్‌ను మహాత్మాగాంధీతో పోల్చడం శోచనీయమని బీజేపీ రాష్ట్ర శాఖ ప్రతినిది కుంతల్ కృష్ణ ఖండించారు.
మూడు దశాబ్ధాలుగా లాలూ ప్రసాద్ యాదవ్‌ను వ్యతిరేకించిన నితీష్ ప్రధాని పదవి కోసం లాలూ ఒడిలో కూర్చున్నారని చురకలు అంటించారు.
దేశ రాజకీయాల్లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అత్యంత అవకాశవాదని కామెంట్స్ చేశారు.