LOADING...
AP Rains: రాబోయే 2 నెలల్లో ఏపీలోని చాలా ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం..  ఐఎండీ అంచనా
రాబోయే 2 నెలల్లో ఏపీలోని చాలా ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం.. ఐఎండీ అంచనా

AP Rains: రాబోయే 2 నెలల్లో ఏపీలోని చాలా ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం..  ఐఎండీ అంచనా

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 01, 2025
11:49 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాల కాలంలో రెండో దశ (ఆగస్టు-సెప్టెంబరు) మధ్యకాలంలో, ఈశాన్య,తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను మినహాయిస్తే మిగిలిన దేశవ్యాప్తంగా సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశముందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేస్తోంది. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో పరిస్థితులు తటస్థంగా కొనసాగుతున్నాయని ఐఎండీ స్పష్టం చేసింది. ఈ తటస్థ స్థితి రుతుపవనాల కాలం అంతా కొనసాగవచ్చని మాన్‌సూన్ మిషన్ క్లైమేట్ ఫోర్‌కాస్ట్ సిస్టమ్‌ సహా ఇతర వాతావరణ నమూనాలు సూచిస్తున్నట్లు తెలిపింది.

వివరాలు 

హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు

జూన్ 1 నుంచి జూలై 31 వరకూ దేశవ్యాప్తంగా 474.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని, ఇది సాధారణ స్థాయి అయిన 445.8 మిల్లీమీటర్ల కంటే 6 శాతం ఎక్కువ అని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర గురువారం వివరించారు. హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు సంభవించాయని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల్లో వరుసగా ఐదో సంవత్సరంగా తక్కువ వర్షాలు కురుస్తుండటం గమనార్హమని, గత 30 ఏళ్ల వర్షపాతం గణాంకాలను పరిశీలిస్తే ఆ ప్రాంతాల్లో వర్షాల మోతాదు క్రమంగా తగ్గుతున్న దిశగా స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు.

వివరాలు 

రాష్ట్రంలో 25.3 శాతం లోటు.. 

నైరుతి రుతుపవనాల కాలం సగానికి చేరినా కూడా రాష్ట్రంలో వర్షాలు ఆశాజనకంగా లేవు. రాష్ట్ర వ్యాప్తంగా సగటున 25.3 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని ఐఎండీ తెలిపింది. ఉమ్మడి తూర్పు గోదావరి,పశ్చిమ గోదావరి,కృష్ణా జిల్లాలను మినహాయిస్తే మిగిలిన అన్ని జిల్లాల్లో ఆగస్టు-సెప్టెంబర్ మధ్యకాలంలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఇక ఇటీవల రాష్ట్రంలో రుతుపవన విరామం (బ్రేక్ మాన్‌సూన్) పరిస్థితులు కొనసాగుతుండటంతో ఉష్ణోగ్రతలు పెరిగాయి. వేసవి కాలాన్ని తలపించేలా వేడి, ఉక్కపోత తీవ్రంగా ఉండటంతో ప్రజలు తీవ్ర అసౌకర్యాలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆగస్టు నెలలో ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.

వివరాలు 

ఆగస్టు రెండో వారంలో వర్షాలు

అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారుల ప్రకారం,రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్రంలోని కొంతమేర ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. అలాగే ఆగస్టు రెండో వారంలో వర్షాలు మరింత తీవ్రంగా పడే సూచనలు వాతావరణ నిపుణులు వ్యక్తపరిచారు.