Page Loader
Budget Session:భారతదేశాన్ని గ్లోబల్ పవర్ హౌస్‌గా మార్చడమే లక్ష్యం.. పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగం
భారతదేశాన్ని గ్లోబల్ పవర్ హౌస్‌గా మార్చడమే లక్ష్యం.. పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగం

Budget Session:భారతదేశాన్ని గ్లోబల్ పవర్ హౌస్‌గా మార్చడమే లక్ష్యం.. పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగం

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 31, 2025
12:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉభయ సభలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. ప్రసంగం ప్రారంభంలో, ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఇటీవలే తుదిశ్వాస విడిచిన మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. ''మహా కుంభమేళా జరుగుతున్న సమయంలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఇటీవల గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నాం'' అని రాష్ట్రపతి హర్షం వ్యక్తంచేశారు. బడ్జెట్‌లో రైతులు, మహిళలు, పేదలు, యువతకు ప్రాధాన్యమిస్తామని ఆమె వెల్లడించారు.

వివరాలు 

రాష్ట్రపతి ప్రసంగంలోని ముఖ్యాంశాలు: 

మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే సర్కారు గత ప్రభుత్వాల పాలనతో పోలిస్తే మూడు రెట్లు వేగంగా పనిచేస్తోంది. భారత్‌ త్వరలో ప్రపంచంలో మూడో ఆర్థికవ్యవస్థగా మారనుంది. పేదరిక నిర్మూలన కోసం అనేక పథకాలు అమలుచేస్తున్నాం. 25 కోట్ల మందిని దారిద్య్రం నుంచి బయటకు తీసుకొచ్చాం. అర్హులందరికీ లబ్ధి చేకూరేలా సంక్షేమ పథకాలను వేగంగా అమలుచేస్తున్నాం. మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నెరవేరుస్తున్నాం. అదనంగా మూడు కోట్ల కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం కోసం ప్రధానమంత్రి ఆవాస్‌ యోజనను పొడిగించాం. ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద 70 ఏళ్లు పైబడిన ఆరు కోట్ల మంది వృద్ధులకు ఆరోగ్య బీమా అందిస్తున్నాం. అమృత్ భారత్‌, నమో భారత్‌ రైళ్లు ప్రవేశపెడుతున్నాం.

వివరాలు 

రాష్ట్రపతి ప్రసంగంలోని ముఖ్యాంశాలు: 

విద్యారంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. యువతకు నూతన ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. నూతన విద్యా విధానంతో ఆధునిక విద్యా వ్యవస్థను ఏర్పాటుచేశాం. సంస్కరణలను వేగవంతం చేశాం. ఒకే దేశం-ఒకే ఎన్నిక,వక్ఫ్‌ సవరణ బిల్లు అమలు దిశగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాం. దేశంలో కార్పొరేట్‌ సంస్థలకు మహిళలు నాయకత్వం వహిస్తున్నారు. ఒలింపిక్‌ పతకాలు సాధిస్తూ దేశం గర్వించేలా చేస్తున్నారు. వారి సాధికారతకు కృషి చేస్తున్నాం. మారుమూల ప్రాంతాల్లో డిజిటల్‌ సేవల కల్పనలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు గొప్ప ముందడుగు.నేషనల్‌ రూరల్‌ లైవ్లీహుడ్‌ మిషన్‌ కింద 91 లక్షలకు పైగా స్వయం సహాయక బృందాలకు సాధికారికత కల్పిస్తున్నాం. 3కోట్ల మందిని లక్‌పతీ దీదీగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.

వివరాలు 

రాష్ట్రపతి ప్రసంగంలోని ముఖ్యాంశాలు: 

భారత్‌ను గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ పవర్‌హౌస్‌గా మార్చడమే మా లక్ష్యం. నేషనల్ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ను ప్రారంభించాం. కృత్రిమ మేధ రంగంలో 'భారత ఏఐ మిషన్‌'ను మొదలుపెట్టాం. భారత్‌ తన సొంత మానవ సహిత అంతరిక్ష ప్రయోగం గగన్‌యాన్‌ను ప్రయోగించే రోజు ఎంతో దూరంలో లేదు. ఎంఎస్‌ఎంఈలకు క్రెడిట్‌ గ్యారెంటీ పథకాలు, ఇ-కామర్స్‌ ఎగుమతి కేంద్రాలు దేశంలో అన్నిరంగాల్లో వ్యాపారాలను ప్రోత్సహిస్తున్నాయి. సైబర్‌ సెక్యూరిటీలో సమర్థత కోసం నిరంతరం కృషి చేస్తున్నాం. డిజిటల్‌ మోసాలు, సైబర్‌ నేరాలు, డీప్‌ఫేక్‌ వంటివి సామాజిక, ఆర్థిక, దేశ భద్రతకు పెను సవాళ్లుగా మారాయి. ప్రపంచ వేదికపై డిజిటల్‌ టెక్నాలజీలో భారత్‌ కీలకపాత్ర పోషిస్తోంది. మన యూపీఐ లావాదేవీల వ్యవస్థ విజయాన్ని అభివృద్ధి చెందిన దేశాలు కూడా ప్రశంసించాయి.