గత ప్రభుత్వాలు గ్రామాలను విస్మరించాయి: ప్రధాని మోదీ
గత పాలకులపై ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం విరుచుకుపడ్డారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని గత ప్రభుత్వాలు విస్మరించాయని, నిధుల కేటాయింపులో వివక్ష చూపాయని మండిపడ్డారు. అయితే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అలాంటి వ్యత్యాసాలను తొలగించిందన్నారు. మధ్యప్రదేశ్‌లోని రేవాలో పంచాయితీ రాజ్ దివాస్ వేడుకలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. చాలా రాజకీయ పార్టీలు గ్రామాల్లోని ప్రజలను విభజించి తమ పబ్బం గడుపుకున్నాయని, బీజేపీ ప్రభుత్వం వచ్చాక, గ్రామాలకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టినట్లు చెప్పారు. గ్రామాల అభివృద్ధికి తమ ప్రత్యేక నిధులను కేటాయించినట్లు వివరించారు. స్వాతంత్ర్యం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు భారతదేశంలోని పంచాయతీరాజ్ వ్యవస్థను నాశనం చేశాయని ప్రధాని మోదీ అన్నారు.
8ఏళ్లలో 30వేలకు పైగా కొత్త పంచాయతీ భవనాలను నిర్మించాం: మోదీ
స్వాతంత్య్రానంతరం అత్యధిక కాలం ప్రభుత్వాన్ని నడిపిన పార్టీ గ్రామాల నమ్మకాన్ని వమ్ము చేసిందని కాంగ్రెస్‍పై పరోక్ష విమర్శలు చేశారు. యూపీఏ హయాంలో 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో 6 వేల పంచాయతీ భవనాలను మాత్రమే నిర్మించారని, కాని తమ ప్రభుత్వం 8 ఏళ్లలో 30వేలకు పైగా కొత్త పంచాయతీ భవనాలను నిర్మించినట్లు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం 70లోపు గ్రామ పంచాయతీలకు మాత్రమే ఆప్టికల్ ఫైబర్‌ను అనుసంధానం చేసిందని, కానీ బీజేపీ ప్రభుత్వం దేశంలోని 2 లక్షలకు పైగా పంచాయతీలకు ఆప్టికల్ ఫైబర్‌ను తీసుకెళ్లినట్లు మోదీ పేర్కొన్నారు. దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు.