PM Modi: 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చాం: ప్రధాని మోదీ
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి జిల్లాలో రూ.541 కోట్ల వ్యయంతో 503 ఎకరాల్లో నిర్మించిన జాతీయ కస్టమ్స్, పరోక్ష పన్నులు, నార్కోటిక్స్ అకాడమీ (నాసిన్)ను మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు. వెనుకబడిన సత్యసాయి జిల్లాలో నార్కోటిక్స్ అకాడమీ (నాసిన్)ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇది ప్రముఖ శిక్షణా కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. రామరాజ్యం అంటే.. ప్రజలకు మంచి పాలన అందించడమే అన్నారు. రామరాజ్యంలో పన్నుల వ్యవస్థ చాలా సరళంగా ఉండేదన్నారు. అలాంటి విధానాలనే తాము తీసుకొచ్చామన్నారు. జీఎస్‌టీ రూపంలో కొత్త ఆధునిక పన్నుల వ్యవస్థకు శ్రీకారం చుట్టామన్నారు.
ఉపాధి అవకాశాల కల్పించి పేదల జీవితాల్లో వెలుగులు తెచ్చాం: మోదీ
అలాగే ఆదాయపన్ను చెల్లింపు విధానాన్నీ సైతం తాము సులభతరం చేసినట్లు మోదీ గుర్తు చేశారు. ఫలితంగా రికార్డు స్థాయిలో పన్నులు వసూలు అవుతున్నట్లు చెప్పారు. అలాగే కేంద్ర ప్రభుత్వం పేదలు, రైతులు, మహిళలు సంక్షేమానికి కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. వీరి కోసం పదేళ్లుగా అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వెల్లడించారు. గత తొమ్మిదేళ్లలో 25కోట్ల మందిని తాము పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చినట్లు మోదీ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తాము చెప్పలేదని, స్వయంగా నీతిఆయోగ్ చెప్పిందన్నారు. అనేక రకాలుగా ఉపాధి అవకాశాల కల్పించడం ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చినట్లు మోదీ చెప్పారు.