Priyanka Vadra-PM Modi: ఏనాడైనా కాంగ్రెస్ మీ బంగారాన్ని దోచుకుందా?: ప్రధాని మోదీ వ్యాఖ్యలకు ప్రియాంకా ధీటుగా సమాధానం
కాంగ్రెస్ (congress) అధికారంలోకి వస్తే ప్రజల సంపదనంతా దోచుకుంటుందని, ప్రజల బంగారాన్ని చొరబాటు దారులు లేదా ముస్లింలకు పంచిపెడుతుందన్న ప్రధాని నరేంద్ర మోదీ (Modi) వ్యాఖ్యలకు ప్రియాంక వాద్రా (Priyanaka Vadra) ధీటుగా సమాధానమిచ్చారు. 50 ఏళ్లపాటు కాంగ్రెస్ దేశాన్ని పరిపాలించిందని ఏనాడు ప్రజల సొమ్మును దోచుకోలేదని వ్యాఖ్యానించారు. ఈ దేశం కోసం మా తల్లి సోనియాగాంధీ తన మంగళ సూత్రాన్ని ధారపోశారని చెప్పారు. మా నాయనమ్మ ఇందిరా గాంధీ యుద్ధం సమయంలో దేశంకోసం తన బంగారాన్ని విరాళంగా ఇచ్చారని గుర్తు చేశారు. బెంగళూరులోని ఎన్నికల ప్రచార సభలో ప్రియాంకవాద్రా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈరోజు టీవీలలో బీజేపీ నాయకుల ప్రసంగాలను చూస్తుంటే ఏం మాట్లాడుతున్నారో అందరూ వింటున్నారని ఆమె తెలిపారు .
బీజేపీకి అభివృద్ధిపై ప్రణాళికలు లేవు: ప్రియాంకాగాంధీ
వాళ్లకు దేశ సంక్షేమం గురించి గానీ అభివృద్ధి గురించి గానీ ఎటువంటి ప్రణాళికలు లేవని తెలుస్తోందన్నారు . బీజేపీ నాయకులు వారి రాజకీయ ప్రయోజనాల కోసం సంచలన వ్యాఖ్యలను చేస్తున్నారని మండిపడ్డారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్ళు అవుతోందని అందులో కాంగ్రెస్ యాభై ఐదు ఏళ్ళు పరిపాలించిందని ఏనాడైనా మీ బంగారాన్ని గాని మీ మంగళ సూత్రాలను గాని కాంగ్రెస్ తీసుకుందా అని ప్రశ్నించారు.