యూపీని వదిలి జాతీయ రాజకీయాలపై ప్రియాంక ఫోకస్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ రాజకీయాలపై మరింత సీరియస్‌గా దృష్టి పెట్టాలని భావిస్తోంది. 2024సార్వత్రిక ఎన్నికలతో పాటు త్వరలో పలు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ పోరు నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో కీలక బాధ్యతలు చేపట్టేందు ప్రియాంక సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ యూనిట్ ప్రధాన కార్యదర్శి పదవికి ప్రియాంక రాజీనామా చేసే, జాతీయ స్థాయిలో బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలు పార్టీ పునరుజ్జీవనాన్ని అందించాయి. ఇదే ఉత్సాహంతో త్వరలో జరగనున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ఎన్నికల్లో రాణించాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. అలాగే 2024 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీని గద్దె దించాలని భావిస్తోంది.
వయనాడ్ నుంచి లోక్‌సభ బరిలో ప్రియాంక గాంధీ
ప్రియాంక యూపీకే పరిమితం కాకూడదని కాంగ్రెస్ సీనియర్ నేతలు భావిస్తున్నారు. ప్రియాంక, రాహుల్ గాంధీ హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం చేశారని, ఇదే పార్టీ విజయానికి కారణమైందని వారు చెబుతున్నారు. ఏప్రిల్‌లో రాహుల్‌పై అనర్హత వేటు పడిన తర్వాత ప్రియాంకతో కలిసి రాహుల్ తన లోక్‌సభ నియోజకవర్గమైన వాయనాడ్ ను సందర్శించారు. ఈ క్రమంలో రాహుల్‌పై అనర్హతవేటు పడిన నేపథ్యంలో 2024 ఎన్నికల్లో ప్రియాంక గాంధీ వయనాడ్ నుంచి బరిలో నిలిచే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
త్వరలోనే ఆ రాష్ట్రాలకు కొత్త పీసీసీ చీఫ్‌ల నియామకం
తమిళనాడు, దీల్లీ, పశ్చిమ బెంగాల్, గుజరాత్, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల పార్టీ యూనిట్లు త్వరలో కొత్త చీఫ్‌లను పొందవచ్చని నివేదికలు చెబుతున్నాయి. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య అంతర్గత పోరు మధ్య రాజస్థాన్ కాంగ్రెస్ కమిటీని పునరుద్ధరించవచ్చని ప్రచారం జరుగుతోంది. అదే విధంగా పార్టీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యుసీ)ని కూడా పునర్వ్యవస్థీకరించబడే అవకాశం ఉంది. కొన్ని వారాల్లోనే ఇది పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. సీడబ్ల్యుసీలో ప్రియాంక గాంధీకి స్థానం కల్పించే అవకాశం ఉందని సమాచారం. యూపీలో ప్రియాంక స్థానంలో దీపేందర్ సింగ్ హుడా, భన్వర్ జితేంద్ర సింగ్, తారిఖ్ అన్వర్, హరీష్ రావత్‌లను నియమించనున్నట్లు తెలుస్తోంది.