Sea erosion: సముద్రకోతతో సమస్యలు.. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రానికి సవాళ్లు
ఏపీ రాష్ట్రానికి విస్తారమైన తీరప్రాంతముంది. ఇక అదే స్థాయిలో సముద్రకోత సమస్య ఉండడం కలవరం పెడుతోంది. ఈ కోత వల్ల శ్రీహరికోట అంతరిక్ష కేంద్రానికీ సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా విశాఖ వద్దనున్న ఆర్కే బీచ్, కృష్ణ, గోదావరి డెల్టా ప్రాంతాలతో పాటు అనేకచోట్ల తీరం కోసుకుపోవడం కలవరపాటుకు గురి చేస్తోంది. కొన్ని చోట్ల నివాసాలు కూడా సముద్రాల్లో కలిసిపోతున్నాయి. మరికొన్ని చోట్ల బీచ్‌లు కనుమరుగు అవుతున్నాయి వాతావరణ మార్పుల వల్ల సముద్ర కోత పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.
తీరప్రాంతంలో 29శాతం కోతకు గురవుతోంది
ఉమ్మడి జిల్లాల్లో తీరాన్ని ఆనుకుని ఉన్న 226 గ్రామాల్లో 29.85 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 48 చోట్ల తీరం కోత తీవ్రంగా ఉందని తీరప్రాంత జాతీయ పరిశోధన కేంద్రం వెల్లడించింది. శ్రీహరి కోట, గోదావరి, కృష్ణ నదులు సముద్రంలో కలిసే చోట, కోరింగ అభయారణ్యం, ఉప్పాడ వద్ద కోత తీవ్రత ఎక్కువ ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. రాష్ట్రంలోని మొత్తం తీరప్రాంతంలో 29శాతం కోతకు గురవుతున్నట్లు అధికార లెక్కలు చెబుతున్నాయి. మూడు మీటర్లకు మంచి సముద్రకోత ఉంటే తీవ్రవ ఎక్కువగా ఉన్నట్లు అంచనా వేశారు.
కోత నివారణకు ప్రత్యేక నిధులు
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ కోత నివారణ కోసం ప్రత్యేక ప్రాజెక్టు చేపట్టనుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు కనీసం రూ.200 కోట్ల నుంచి రూ.800 కోట్ల వరకు కేంద్రం నుంచి నిధులు లభించనున్నాయి. ఈ వ్యవహారంపై తొలి సమావేశాన్ని జులైలో దిల్లీలో నిర్వహించారు. ఈ నెలాఖరుకల్లా ముసాయిదా ప్రాజెక్టు నివేదికలు కూడా సిద్ధం కానున్నాయి. ప్రాజెక్టు వ్యయంలో 90శాతం కేంద్రం ఇవ్వనుండగా, మరో 10శాతం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఖర్చు చేయనుంది.