స్వలింగ వివాహ పిటిషన్లపై సుదీర్ఘంగా సాగిన విచారణ; రేపటికి వాయిదా
ఈ వార్తాకథనం ఏంటి
స్వలింగ సంపర్కులకు పెళ్లి చేసుకునే హక్కు ఉందని సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ స్పష్టం చేశారు. వారిని ఒటరిగా వదిలేస్తే సరిపోదన్నారు. కానీ వారికి అవసరమైన సామాజిక సంస్థల నిర్మాణం చాలా అనివార్యమని నొక్కి చెప్పారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, జస్టిస్‌లు ఎస్‌కే కౌల్, రవీంద్ర భట్, హిమా కోహ్లీ, పీఎస్ నరసింహతో రాజ్యాంగ ధర్మాసనం స్వలింగ వివాహానికి చట్టపరమైన గుర్తింపును కోరుతూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది రోహత్గీ కీలక వాదనలను వినిపించారు. స్వలింగ సంపర్కులను ఇంట్లోనే ఉండండి, బయటకు రావద్దు అంటున్నారని, తమ హక్కుల కోసం కోర్టును ఆశ్రయించే నైతికత వారికి ఉందన్నారు.
సుప్రీంకోర్టు
చిన్న వర్గమే అనుకోవద్దు: న్యాయవాది రోహత్గీ
స్వలింగ సంపర్కుల హక్కులను పార్లమెంట్ మంజూరు చేసే వరకు వేచి ఉండే బదులు, కోర్టును ఆశ్రయించే హక్కు వారికి ఉందని న్యాయవాది రోహత్గీ చెప్పారు.
స్వలింగ సంపర్కులు పదివేల మంది మాత్రమే ఉండొచ్చని, వారిని చిన్న వర్గంగా అనుకోవద్దని రోహత్గీ సూచించారు. వారి పట్ల వివక్ష చూపకూడదన్నారు. వివాహం చేసుకోవడానికి స్వలింగ సంపర్కులకు ప్రాథమిక హక్కు ఉందని న్యాయవాది రోహత్గీ చెప్పారు.
పెళ్లి తంతును సమానంగా గుర్తించాలని తాను కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కేంద్రం తరఫున వాదనలు వినిపించిన ఎస్‌జీ మెహతా, ఈ అంశాన్ని పార్లమెంటును పరిశీలించనివ్వండని కోర్టును కోరారు.
అనంతరం స్పందించిన సీజేఐ చంద్రచూడ్, తాము పార్లమెంటరీ కమిటీలతో విస్తృతంగా చర్చించినట్లు పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు
గే వివాహాలపై విచారణను వ్యతిరేకించిన కేంద్ర ప్రభుత్వం
గే వివాహాలకు చట్టపరమైన అనుమతికి వ్యతిరేకంగా కేంద్రం అఫిడవిట్‌ను దాఖలు చేసింది.
స్వలింగ వివాహాన్ని కేవలం పట్టణ వర్గాలు అభిప్రాయంగా కేంద్రం పేర్కొంది. కొత్త సామాజిక సంబంధాన్ని ఏర్పరచుకోవడంపై నిర్ణయం తీసుకునే ఏకైక వేదిక పార్లమెంటు అని పిటిషన్ల విచారణపై అభ్యంతరం వ్యక్తం చేసింది.
విచారించే ఐదుగురు న్యాయమూర్తులు దేశ ప్రజలు అభిప్రాయాలకు ప్రాతినిధ్యం వహించరనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రం తరపున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా రాజ్యాంగ ధర్మాసనానికి తెలిపారు.
కొత్త హక్కులను సృష్టించడం, సంబంధాలను గుర్తించడం, అలాంటి సంబంధాలకు చట్టబద్ధమైన పవిత్రతను కల్పించడం చట్టసభల ద్వారానే సాధ్యమవుతుందని, న్యాయవ్యవస్థ ద్వారా కాదని కేంద్రం ధర్మాసనానికి సూచించింది.