Page Loader
Pakistan Spy: పంజాబ్‌లో పాకిస్తాన్ గూఢచారి అరెస్ట్.. ఆపరేషన్ సిందూర్ సమయంలో సున్నిత సమాచారం చేరవేత..
ఆపరేషన్ సిందూర్ సమయంలో సున్నిత సమాచారం చేరవేత..

Pakistan Spy: పంజాబ్‌లో పాకిస్తాన్ గూఢచారి అరెస్ట్.. ఆపరేషన్ సిందూర్ సమయంలో సున్నిత సమాచారం చేరవేత..

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 03, 2025
10:26 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలో పాకిస్థాన్ తరపున గూఢచర్యం చేస్తున్న వ్యక్తులు వరుసగా అధికారులకు పట్టుబడుతున్నారు. ఇటీవలే హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాక్‌కి సమాచారం అందించడంపై పట్టుబడి దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ ఘటన ఇంకా మరిచిపోకముందే,పంజాబ్‌లో మరో గూఢచారి అరెస్ట్‌య్యాడు. పంజాబ్ రాష్ట్రంలోని తరన్‌తరన్ జిల్లాలో గగన్‌దీప్ సింగ్ అనే వ్యక్తిని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్నట్లు అధికారులకు పక్కా సమాచారం ఉంది. 'ఆపరేషన్ సిందూర్' పేరుతో భారత సైన్యం సరిహద్దుల్లో చేపట్టిన కీలక కదలికల గురించి ఇతను పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి లీక్ చేశాడన్న ఆరోపణలున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో భారత సైనిక చర్యలపై గత కొన్నేళ్లుగా పాకిస్తాన్‌కి సమాచారాన్ని అందిస్తూ వచ్చినట్లు తెలుస్తోంది.

వివరాలు 

భారత వ్యతిరేక భావజాలాన్ని ప్రదర్శిస్తూ చావ్లా వివాదాస్పద వ్యాఖ్యలు

ప్రముఖ ఖలిస్తానీ ఉగ్రవాది గోపాల్ సింగ్ చావ్లాతో గగన్‌దీప్ సింగ్ గత ఐదేళ్లుగా నేరుగా సంబంధాలు కొనసాగిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలోనే ఇతనికి పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ (PIOలు) పరిచయం అయ్యారు. భారతదేశంలోనే నుంచే PIOల ద్వారా గగన్‌కి నిధులు అందినట్టు సమాచారం. ఈ విషయాన్ని మంగళవారం పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ వెల్లడించారు. గోపాల్ సింగ్ చావ్లా — పాకిస్తాన్‌లోని నాన్‌కానా సాహిబ్ ప్రాంతానికి చెందిన ఖలిస్తాన్ అనుకూల నేతగా భావించబడుతున్నాడు. చావ్లా తరచూ భారత వ్యతిరేక భావజాలాన్ని ప్రదర్శిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు.

వివరాలు 

 ఐదేళ్లుగా నిత్యం టచ్‌లో.. 

మతపరమైన కార్యక్రమాల నిమిత్తం పాకిస్తాన్‌కు వెళ్లే భారతీయుల మధ్య ఐఎస్ఐ కోణాలకోసం తేలికపాటి లక్ష్యాలను గుర్తించడమనే బాధ్యత అతనికే అప్పగించబడినట్టు తెలుస్తోంది. చావ్లా తొలిసారిగా జమాత్ ఉద్ దావా, లష్కరే తోయిబా ఉగ్రవాద చీఫ్ హఫీజ్ సయీద్‌తో కలిసి ఉన్న ఫోటోల ద్వారా పబ్లిక్ డొమెయిన్‌లోకి వచ్చాడు. పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి గగన్ దేశ భద్రతకు ముప్పు కలిగించే కీలక సమాచారాన్ని అందించాడని, కొన్ని వ్యూహాత్మక ప్రదేశాలకు సంబంధించిన వివరాలను పంచుకున్నట్టు దర్యాప్తులో తేలిందని డీజీపీ తెలిపారు. గగన్‌దీప్, గోపాల్ చావ్లా మధ్య గత ఐదేళ్లుగా నిత్యం టచ్‌లో ఉన్నట్టు సమాచారం. గగన్ వినియోగిస్తున్న మొబైల్ ఫోన్‌ను, అలాగే ఐఎస్ఐతో సంబంధం ఉన్న 20కిపైగా పరిచయాలను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

వివరాలు 

2019లో హర్పాల్ సింగ్ పాలా అరెస్ట్ 

ఈ గూఢచారుల ముఠాను పూర్తిగా ఛేదించేందుకు అధికారులు లోతైన దర్యాప్తు చేపట్టారు. గగన్‌దీప్‌ అరెస్టుకు ముందు కూడా ఇలాంటివే కేసులు వెలుగుచూశాయి. 2019లో పంజాబ్‌లోని జలంధర్ పోలీసులు భటిజా గ్రామానికి చెందిన హర్పాల్ సింగ్ పాలాను అరెస్ట్ చేశారు. అతను కూడా ఐఎస్ఐ ఏజెంట్ అయిన చావ్లాకు కీలకమైన రహస్య సమాచారాన్ని అందించినట్టు గుర్తించారు.