
Amaravati: అమరావతి క్వాంటమ్ వ్యాలీలో 'క్వాంటమ్ కాంపొనెంట్స్' ప్రాజెక్టు.. ముందుకొచ్చిన అంబర్ ఎంటర్‌ప్రైజెస్
ఈ వార్తాకథనం ఏంటి
అమరావతి క్వాంటమ్ వ్యాలీలో క్వాంటమ్ క్రయోజెనిక్ కాంపొనెంట్స్ ప్రాజెక్టులో రూ.200 కోట్ల పెట్టుబడి చేయడానికి అంబర్ ఎంటర్‌ప్రైజెస్ ఇండియా లిమిటెడ్ అంగీకరించింది. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనను అంబర్ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్,సీఈఓ జస్బీర్‌సింగ్ గురువారం సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశమై చర్చించారు. ప్రభుత్వం తెలిపిన ప్రకారం,ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆధునిక క్రయోజెనిక్ పరిష్కారాలను అభివృద్ధి చేసి, క్వాంటమ్ హార్డ్‌వేర్ వ్యవస్థను మరింత బలపరచడంలో ముఖ్య పాత్ర పోషించనుంది. అంతేగాక,జాతీయక్వాంటమ్ మిషన్ కింద సూపర్ కండక్టింగ్ క్వాంటమ్ కంప్యూటర్లకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని,ప్రపంచ స్థాయిలో సాంకేతిక నూతనతలకు అమరావతిని కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ప్రభుత్వం తెలియజేసింది. క్వాంటమ్ రంగంలో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ ప్రధాన గమ్యస్థానం అవుతుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
వివరాలు
ఈ ప్రాజెక్టుతో క్వాంటమ్ పరిజ్ఞానానికి అవసరమైన సమర్థవంతమైన పరిశోధన
'క్వాంటమ్ కంప్యూటింగ్, ఆధునిక ఎలక్ట్రానిక్స్, కీలక భాగాల తయారీ, పరిశోధన రంగాల్లో శక్తివంతమైన ప్రగతిని సాధిస్తాం. ఐబీఎం, టీసీఎస్ సంస్థలు, జాతీయ క్వాంటమ్ మిషన్ సహకారంతో అమరావతి క్వాంటమ్ వ్యాలీని ప్రాధాన్య ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం' అని అంబర్ ఎంటర్‌ప్రైజెస్ సీఈఓ జస్బీర్‌సింగ్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా దేశంలో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థను బలపరచడం సాద్యమవుతుందని. భవిష్యత్తులో అవసరమయ్యే సాంకేతిక పరిజ్ఞానాన్ని సమగ్రంగా అందించడంలో ప్రాజెక్టు సాయపడుతుందని చెప్పారు. ఎన్‌క్యూఎం డైరెక్టర్ జె.బి.వి. రెడ్డి మాట్లాడుతూ, క్వాంటమ్ పరిజ్ఞానానికి అవసరమైన సమర్థవంతమైన పరిశోధన, తయారీ వ్యవస్థలు ఈ ప్రాజెక్టుతో స్థాపించబోతున్నాయని, ఇది దేశ అభివృద్ధికి బలమైన మద్దతుగా నిలవబోతుందని వివరించారు.