Rahul Gandhi: 50 శాతానికి మించి రిజర్వేషన్లు కలిపిస్తాం.. రాహుల్ గాంధీ క్లారిటీ
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో రిజర్వేషన్ల గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యల కారణంగా రాహుల్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపధ్యంలో ఆయన స్పందిస్తూ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. రిజర్వేషన్లకు తాను వ్యతిరేకి కాదని స్పష్టం చేశారు. ''నేను రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు. నా వ్యాఖ్యలను తప్పుగా చూపించే ప్రయత్నాలు జరిగాయి. ఇక్కడ నేను స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను 50 శాతానికి మించి పెంచుతాం'' అని రాహుల్ పేర్కొన్నారు.
రిజర్వేషన్ల రద్దు గురించి తమ పార్టీ అప్పుడే ఆలోచిస్తుంది : రాహుల్
అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ వరుస సమావేశాల్లో పాల్గొంటూ, రిజర్వేషన్ల గురించి చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి. రాహుల్ మాట్లాడుతూ, ప్రస్తుతం భారత్‌లో ఆదివాసీలు, దళితులు, ఓబీసీలకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదని, అభివృద్ధిలో వారి భాగస్వామ్యం పరిమితంగానే ఉందని అన్నారు. దేశంలో అన్ని వర్గాల వారికి సమానంగా అవకాశాలు లభించినప్పుడే రిజర్వేషన్ల రద్దు గురించి తమ పార్టీ ఆలోచిస్తుందని చెప్పారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో, రాహుల్ గాంధీపై విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా స్పందించిన ఆయన, తన వ్యాఖ్యలకు సంబంధించి స్పష్టత ఇచ్చారు.