అమెరికాలో రాహుల్ గాంధీ బిజినెస్ మీటింగ్స్...పెగాసెస్ పై సంచలన వ్యాఖ్యలు
అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పెగాసస్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. యూఎస్ టూర్ లో ఉన్న రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు ఎక్కు పెట్టారు. మోదీ దేవుడికైనా ఉపదేశాలివ్వగలడంటూ రాహుల్ ఎద్దేవా చేశారు.యూఎస్ వాషింగ్టన్‌లో వ్యాపారవేత్తలతో సమావేశమైన రాహుల్ అక్కడ పెగాసస్ వైరస్ గురించి ప్రస్తావించారు. తన ఫోన్ ట్యాపింగ్ బారిన పడుతోందని తెలిసినా తాను ఏం చేయలేకపోయానని నిస్సహాయత వ్యక్తం చేశారు. స్టార్టప్‌ల ప్రతినిధులు, వివిధ పారిశ్రామిక వేత్తలతో చర్చించిన రాహుల్, (ఏఐ) టెక్నిక్స్-ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సహా పలు ఆధునిక సాంకేతికతల గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా డేటాని బంగారంతో పోల్చారు. డేటా రంగంలో భారత్ ఎంతో సామర్థ్యాన్ని పెంపొందించుకుందని ఆయన వివరించారు.
బీజేపీని ఓడించడం పెద్ద కష్టమైన పనేం కాదు : రాహుల్ గాంధీ
శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఓ వర్సిటీలో ఎన్ఆర్ఐలు నిర్వహించిన సమావేశంలోనూ రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాజాగా కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం సాధించడాన్నీ ప్రస్తావించిన రాహుల్, 2024 ఎలక్షన్స్ లోనూ ఇదే ప్యూహంతో ముందుకెళ్తామన్నారు. కేంద్రంలోని బాజపాను ఓడించడం పెద్ద కష్టమైన పనేం కాదని, ప్రతిపక్షాలన్నీ ఓ పద్ధతి ప్రకారం ఒక్కటవ్వాలన్నారు. బీజేపీలోనూ కొన్ని లొసుగులున్నాయని, వాటిని పట్టుకుని, ప్రతిపక్షాలను సరైన విధంగా ఐక్యంగా నడిపించగలిగితే ఈజీగానే మోదీని ఓడించొచ్చన్నారు.