Rahul Gandi: మోదీ 'మన్ కీ బాత్' కాదు, 'కామ్ కీ బాత్' గురించి మాట్లాడు.. రాహుల్ గాంధీ
శ్రీనగర్‌లో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. మోదీ తన 'మన్ కీ బాత్' కార్యక్రమంపై మాత్రమే దృష్టి పెట్టి, వాస్తవ సమస్యలైన నిరుద్యోగం, పెరిగిన ధరలను నియంత్రించడంలో విఫలమయ్యారని రాహుల్ ఆరోపించారు. మోదీ 'మన్ కీ బాత్' మాత్రమే చెబుతారని, కానీ దేశంలోని ప్రజల కష్టాలు, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి 'కామ్ కీ బాత్' గురించి మాట్లాడరని ఆయన ఎద్దేవా చేశారు. అయితే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి మోదీ, బీజేపీ దేశంలో విభజనను వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు.
విద్యావంతులకు ఉద్యోగాలు దొరకడం లేదు
గత 10 ఏళ్లుగా మోదీ, బీజేపీ ఎక్కడికి వెళ్లినా విద్వేషం మాత్రమే వ్యాపింపజేశారని, అన్నదమ్ములు ఒకరితో ఒకరు పోట్లాడుకునే పరిస్థితిని తీసుకొచ్చారని మండిపడ్డారు. విద్యావంతులకు సరైన ఉద్యోగాలు దొరకడం లేదని, దీనికి కారణం మోదీ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడం, అక్కడి ప్రజల ప్రజాస్వామ్య హక్కులను హరించడమే అని చెప్పారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ సెప్టెంబర్ 18న, రెండో దశ సెప్టెంబర్ 25న, మూడో దశ అక్టోబర్ 1న జరగనుంది.