Rahul Gandi: బాబా సిద్దిఖీ హత్యపై రాహుల్ గాంధీ ఆగ్రహం.. ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు
ఎన్సీపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ దారుణ హత్యకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిఖీ కుటుంబానికి సానుభూతి తెలుపుతూ, ఈ హత్యకు పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్రలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని విమర్శలు చేశారు. నిందితులకు కఠినమైన శిక్ష విధించి, బాధితులకు న్యాయం చేయాలని గాంధీ పిలుపునిచ్చారు. బాబా సిద్దిఖీ శనివారం రాత్రి ముంబై బాంద్రాలోని తన కుమారుడి కార్యాలయంలో ఉన్న సమయంలో ముగ్గురు గుర్తుతెలియని దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సిద్దిఖీ భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై, కుటుంబసభ్యులు అతన్ని హుటాహుటిన లీలావతి ఆసుపత్రికి తరలించారు.
పోలీసుల అదుపులో నిందితులు
కానీ ఆయన చికిత్స పొందుతూ ఆయన మరణించారు. పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకోగా, మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది. బాబా సిద్దిఖీ, మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ స్థానాన్ని సంపాదించుకున్నారు. 1999, 2004, 2009 సంవత్సరాల్లో బాంద్రా వెస్ట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయాలు సాధించారు. 2004, 2009లో మహారాష్ట్ర మంత్రివర్గంలో స్థానాన్ని పొందారు. 2013లో బాబా సిద్దిఖీ నిర్వహించిన ఇఫ్తార్ విందు బాలీవుడ్ అభిమానుల మధ్య గుర్తుండిపోతుంది. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్లు షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ పాల్గొన్నారు.