
Rahul Gandhi: లోక్‌సభలో నన్ను మాట్లాడనివ్వట్లేదు: రాహుల్ గాంధీ
ఈ వార్తాకథనం ఏంటి
లోక్‌సభలో తనకు మాట్లాడేందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
సభా కార్యకలాపాలు సజావుగా సాగేందుకు ఇది సరైన మార్గం కాదని స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఏం జరుగుతోందో తనకు తెలియదని, మాట్లాడేందుకు అనుమతి కోరినా ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతిపక్ష నాయకుడికి సభలో మాట్లాడే హక్కు సంప్రదాయంగా ఉన్నదని గుర్తు చేశారు. బుధవారం లోక్‌సభ వాయిదా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
వివరాలు
ఏడు-ఎనిమిది రోజులుగా నన్ను మాట్లాడనివ్వడం లేదు: రాహుల్
''నేను ఎప్పుడు లేచి నిలబడినా మాట్లాడేందుకు అనుమతి ఇవ్వడం లేదు. మేము ప్రస్తావించాలనుకునే అంశాలను లేవనెత్తేందుకు అవకాశం ఇవ్వడం లేదు. నేను ఏమీ చేయలేదు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా కూర్చున్నాను. గత ఏడు-ఎనిమిది రోజులుగా నన్ను మాట్లాడనివ్వడం లేదు. ఇది ఒక కొత్త ఎత్తుగడ. ప్రతిపక్షానికి ఇక్కడ స్థానం లేదు. ఇటీవల ప్రధాని కుంభమేళా గురించి మాట్లాడినప్పుడు, నేను నిరుద్యోగంపై మాట్లాడాలనుకున్నాను. కానీ, నాకు అవకాశం ఇవ్వలేదు. మమ్మల్ని మాట్లాడనివ్వకపోవడం ప్రజాస్వామ్య విరుద్ధం'' అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
వివరాలు
ప్రతిపక్ష నేత 349వ నిబంధన ప్రకారం..
ఇదే సమయంలో, బుధవారం సభా కార్యకలాపాల సందర్భంగా స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ, సభ గౌరవాన్ని కాపాడేందుకు నిబంధనలను పాటించాలని సూచించారు.
సభ్యులు హుందాగా వ్యవహరించాలని సూచించారు. సభలో సభ్యుల ప్రవర్తన ఉన్నత ప్రమాణాలకు అనుగుణంగా లేదని అనేక సందర్భాల్లో తన దృష్టికి వచ్చిందని తెలిపారు.
ఈ సభలో తండ్రి-కూతురు, తల్లి-కుమార్తె, భార్యా-భర్తలతో కూడిన సభ్యులు ఉన్నారని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష నేత 349వ నిబంధన ప్రకారం ప్రవర్తిస్తారని తాను ఆశించానని స్పష్టం చేశారు.