రాహుల్ గాంధీ వ్యాఖ్యలు అవమానకరం.. హరిశ్ సాల్వే ఘాటు విమర్శలు
మోదీ ఇంటిపేరుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సరికావని మాజీ సొలిసిటర్ జనరల్, న్యాయ నిపుణులు హరీశ్ సాల్వే అన్నారు. ఓ ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదని చెప్పారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చాలా అవమానకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కేసులో రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించడంపై హారిశ్ సాల్వే మాట్లాడారు. ఈ కేసులో మెరిట్స్ ఆధారంగా సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకోలేదని, రాహుల్ నియోజకవర్గంలోని ఆందోళన కారణంగా ఇలాంటి నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.
ఈ కేసులో మెరిట్స్ కు, స్టే ఎత్తివేయడానికి సంబంధం లేదు : సాల్వే
రాహుల్ గాంధీకి శిక్ష పడుతుందా లేదో అన్న విషయం పక్కనపెడితే, దేశ ప్రధాని కావాలని భావిస్తున్న వ్యక్తి మాట్లాడిన మాటలు ఇవి కావని సాల్వే వివరించారు. ముఖ్యంగా రాహుల్ వ్యాఖ్యలు సరికాదని సుప్రీంకోర్టు జడ్జిలు కూడా చెప్పారని, ఓ ఉన్నత స్థాయి వ్యక్తి సరైన పద్ధతిలో మాట్లాడాలని సాల్వే గుర్తు చేశారు. కేసులో మెరిట్స్‌కు, స్టే ఎత్తివేయడానికి సంబంధం లేదని, ఎంపీ సభ్యత్వంపై నిషేధం ఉంటే ఆయన నియోజకవర్గానికి పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం ఉండదని, అందుకే ఆయన శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించిన ఆయన చెప్పారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాల్వే ఈ విషయాలను తెలిపారు.