Rahul Gandhi : సీఈసీ రాజీనామా కోరుతూ ఇండియా కూటమి ఆందోళన.. .. రాహుల్,ప్రియాంక సహా పలువురు నేతల అరెస్టు
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి నేతలు ఢిల్లీలో చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. ఆకాశవాణి భవన్ వద్ద ఆందోళనకు దిగిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీతో పాటు పలువురు కీలక నేతలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం పార్లమెంట్ నుంచి ఈసీఐ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించాలని ఇండియా కూటమి ఎంపీలు నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంకా గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సహా వివిధ పార్టీలకు చెందిన నేతలు,ఎంపీలు పాల్గొన్నారు.
వివరాలు
ఆకాశవాణి భవన్ సమీపంలోనే నిరసనకు నేతలు
అయితే ఈసీఐ కార్యాలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన ఇండియా కూటమి నేతలను పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో ఆకాశవాణి భవన్ సమీపంలోనే నేతలు నిరసనకు దిగారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మంగళవారం రాత్రి పోలీసులు పలువురు నాయకులను అదుపులోకి తీసుకున్నారు.
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, కేసీ వేణుగోపాల్, పవన్ ఖేరా, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తదితరులను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం.
ఈ సందర్భంగా నేతలు, కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట, ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఆ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఆందోళన సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.